చైనా వద్దు భారత్ ముద్దు... ఈ బడా కంపెనీల కీలక నిర్ణయం!
అవును... కార్ల తయారీ బడా కంపెనీలు భారత్ వైపు క్యూ కడుతున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదిచింది.;
జపాన్ లోని అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... టయోటా మోటార్ కార్పొరేషన్, హోండా మోటార్ కో లిమిటెడ్, సుజుకి మోటార్ కార్పొరేషన్ కంపెనీలు చైనాకు దూరంగా జరగాలని భావించి.. మేక్ ఇన్ ఇండియా కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడులను సమకూరుస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... కార్ల తయారీ బడా కంపెనీలు భారత్ వైపు క్యూ కడుతున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదిచింది. ఇందులో భాగంగా... ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటా కర్ణాటకలో తన ప్రస్తుత కర్మాగారాన్ని విస్తరించడానికి, మహారాష్ట్రలో కొత్త కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 26,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
ఇదే సమయంలో... భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న సుజుకి, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.70,000 కోట్ల వరకు భారత్ లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 40 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక హోండా కంపెనీ తన ప్రణాళిక ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లలో ఒకదానికి భారతదేశాన్ని ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా మారుస్తామని ఇటీవల తెలిపింది. దీంతో ఇది చైనాకు బిగ్ బ్యాడ్ న్యూస్ కాగా మేక్ ఇన్ ఇండియాకు గుడ్ న్యూస్ అని అంటున్నారు.
ఈ విషయాలపై లండన్ లోని పెల్హామ్ స్మిథర్స్ అసోసియేట్స్ లో ఆటో విశ్లేషకురాలు జూలీ బూట్ రాయిటర్స్ తో మాట్లాడుతూ.. చైనాకు ప్రత్యామ్నాయ మార్కెట్ గా భారత్ మంచి ఎంపిక అని అన్నారు. ఇదే క్రమంలో.. ప్రస్తుతానికి జపనీయులు భారత్ చాలా మెరుగైన మార్కెట్ గా భావిస్తున్నారని.. వారు చైనా పోటీదారులతో వ్యవహరించాల్సిన అవసరం లేదని నమ్ముతున్నారని తెలిపారు!
మరోవైపు ఈ విషయాలపై స్పందించిన టయోటా ప్రెసిడెంట్ కోజి సాటో... భారత మార్కెట్ చాలా ముఖ్యమైనదని.. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనుందని అన్నారు. గత వారం జపాన్ మొబిలిటీ షోలో విలేకరులతో మాట్లాడుతూ.. అనేక ఇతర వాహన తయారీదారులు కూడా భారత్ మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.
కాగా... గత మూడు సంవత్సరాలలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు సగటున 7-8% ఉండగా, అదే సమయంలో దాని కార్ల మార్కెట్ 9-10% వేగంగా వృద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక పథకం 'మేక్ ఇన్ ఇండియా' వైపు మరిన్ని విదేశీ కార్ల తయారీదారులను ఆకర్షించడం ద్వారా ప్రభుత్వం ఈ ఊపును కొనసాగించాలని కోరుకుంటోంది.