ప్రయాణ భద్రతను కట్టుదిట్టం చేస్తున్న చైనా.. కారణం ఇదే..

వాహన రంగంలో సరికొత్త డిజైన్‌లకు, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లకు కేంద్రంగా నిలుస్తున్న చైనా ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2026-02-15 12:30 GMT

వాహన రంగంలో సరికొత్త డిజైన్‌లకు, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లకు కేంద్రంగా నిలుస్తున్న చైనా ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్టైల్, టెక్నాలజీ, ట్రెండ్‌ల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టమైన సంకేతం పంపింది. కొద్ది రోజుల క్రితమే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను నిషేధించిన చైనా ప్రభుత్వం, ఇప్పుడు హాఫ్ స్టీరింగ్ (యోక్ స్టైల్ స్టీరింగ్)పై కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. 2027, జనవరి 1 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి.

ఫష్ డోర్ విషయంలో జాగ్రత్తలు..

ఇటీవలి సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు, హైఎండ్ కార్లలో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, హాఫ్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఫ్యాషన్‌గా మారాయి. ఇవి వాహనానికి ఆధునిక రూపం ఇస్తాయని తయారీదారులు భావించారు. కానీ ప్రమాదాల సమయంలో ఇవే ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయనే ఆందోళన పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో ఫ్లష్ హ్యాండిల్స్ తలుపులు తెరుచుకోకుండా ఉండడం, రక్షణ సిబ్బందికి లోపలివారిని బయటకు తీసేందుకు ఇబ్బందులు కలిగించడం వంటి ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే చైనా వాటిని బ్యాన్ చేసింది.

స్టీరింగ్ కూడా మార్చనుందా?

ఇప్పుడు హాఫ్ స్టీరింగ్ వ్యవస్థపై కూడా అదే విధమైన ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అధికారిక పరిశోధనల ప్రకారం.., ప్రమాదాల్లో డ్రైవర్లకు తగిలే గాయాల్లో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణమని తేలింది. ముఖ్యంగా హాఫ్ స్టీరింగ్ డిజైన్ వల్ల ఢీకొన్న సమయంలో గాయాల తీవ్రత పెరుగుతోందని నివేదికలు సూచించాయి. స్టీరింగ్ పూర్తి వృత్తాకారంలో లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ సందర్భాల్లో వాహన నియంత్రణలో సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు గుర్తించారు.

వాహన పరిశ్రమకు హెచ్చరిక..

చైనా తీసుకున్న ఈ నిర్ణయం వాహన పరిశ్రమకు ఒక హెచ్చరిక లాంటిది. డిజైన్ ప్రయోగాలు చేసేటప్పుడు భద్రతను రెండో స్థానంలో పెట్టకూడదనే సందేశం ఇందులో దాగి ఉంది. మార్కెట్లో ఆకర్షణ కోసం తీసుకొచ్చిన ఫీచర్లు, రోడ్లపై ప్రమాదకరంగా మారితే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే. చైనా అదే చేసింది. ఈ నిర్ణయం ప్రపంచ ఆటోమొబైల్ రంగంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ప్రపంచంలో అతిపెద్ద వాహన మార్కెట్. అక్కడ అమల్లోకి వచ్చే నియమాలు ఇతర దేశాల తయారీదారులపై కూడా ఒత్తిడి తెస్తాయి. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షించే అవకాశం ఉంది.

స్పష్టమైన దిశను చూపుతున్న చైనా..

మొత్తానికి, చైనా తాజా నిర్ణయం భద్రత విషయంలో ఒక స్పష్టమైన దిశను చూపుతోంది. వాహనం ఎంత ఆధునికంగా ఉన్నా, ప్రయాణికుడి ప్రాణం కంటే గొప్పది కాదు. టెక్నాలజీ, స్టైల్, ఇన్నోవేషన్ అన్నీ భద్రత తర్వాతే. 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ నియమాలు వాహన రంగంలో భద్రతకు కొత్త ప్రమాణాలను స్థాపించవచ్చు.

Tags:    

Similar News