మరిన్ని చిక్కుల్లో మాజీ మంత్రి జోగి కుటుంబం.. ఏకంగా 11 మందిపై కేసు
గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో రాజకీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఇప్పుడు సొంత కుటుంబంలోనే తలెత్తిన వివాదంలో గృహహింస కేసులో ఇరుక్కుని అప్రతిష్ట పాలయ్యారని అంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో రాజకీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఇప్పుడు సొంత కుటుంబంలోనే తలెత్తిన వివాదంలో గృహహింస కేసులో ఇరుక్కుని అప్రతిష్ట పాలయ్యారని అంటున్నారు. మాజీ మంత్రి హోదాలో ఇంటా బయటా పెద్దరికం చాటాల్సిన జోగి రమేష్ స్వయంగా కోడలు పెట్టిన కేసులో నిందితుడిగా ఇరుక్కోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో వైసీపీ కూడా ఆత్మరక్షణలో పడినట్లైందని అంటున్నారు.
పెళ్లైన నెల రోజులకే వేధింపులు?
జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్‌కు, తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనతో గత ఏడాది (2025) మే 28న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లైన నెల రోజులకే వీరి కాపురంలో మనస్పర్థలు తలెత్తాయని మేఘన పోలీసులకు తెలిపారు. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించారంటూ ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. జోగి రమేష్ కుటుంబంపై గతంలో కొన్ని కేసులు నమోదైనప్పటికీ, ఈ కేసుతో రాజకీయాలకు సంబంధం లేకపోవడంతో వ్యక్తిగతంగా మాజీ మంత్రి ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కోడలిపై వేధింపులు, హత్యయత్నం వంటి అభియోగాలు మాజీ మంత్రికి న్యాయపరంగానూ చిక్కులు తెచ్చే అవకాశం ఉన్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినప్పటికీ ఎలాంటి రాజీ కుదరకపోవడంతో, చివరకు జోగి కోడలు మేఘన పోలీసులను ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒకేసారి 11 మందిపై ఎఫ్‌ఐఆర్
బాధితురాలు మేఘన ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన భార్య శకుంతల, కుమారుడు రాజీవ్, చిన్నకుమారుడు రోహిత్, కూతురు ప్రియాంక, జోగి రమేష్ సోదరుడు జోగి రాము కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు సహా మొత్తం 11 మందిపై గృహహింస, వరకట్న వేధింపులు, మోసం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలి ఫిర్యాదులో తీవ్రత ఆధారంగా కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడంతో ఈ కేసులో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పెద్దరికం చేయాల్సిన నేతపై విమర్శలు
సమాజంలోనూ, పార్టీ పరంగానూ ఒక నాయకుడిగా, కుటుంబ పెద్దగా ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన జోగి రమేష్ సొంత కుటుంబంలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోందని అంటున్నారు. కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కుటుంబ పెద్దపై ఉంటుంది. కానీ, ఏకంగా కుటుంబ పెద్దపైనే, కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసే స్థాయికి సమస్య వెళ్లడం జోగి రమేష్ వ్యక్తిగత ప్రతిష్టకు పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడికి భిన్నంగా, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న జోగి రమేష్‌కు ఇప్పుడు సొంత ఇంటి రచ్చ పోలీసు స్టేషన్ వరకు చేరడం రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారని, బాధితురాలు అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి, మాజీ మంత్రి కుటుంబంలో రాజుకున్న ఈ గృహహింస వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.