అంతరిక్షంలో అమెరికా ఆయుధాలు.. అసలు లక్ష్యం ఇదేనా?
నింగి అంటే ఒకప్పుడు కేవలం శాస్త్ర పరిశోధనలకు, కమ్యూనికేషన్లకు, నావిగేషన్‌కు మాత్రమే పరిమితమైన అనంత నిశ్శబ్దం.
నింగి అంటే ఒకప్పుడు కేవలం శాస్త్ర పరిశోధనలకు, కమ్యూనికేషన్లకు, నావిగేషన్‌కు మాత్రమే పరిమితమైన అనంత నిశ్శబ్దం. కానీ మారిన ప్రపంచ రాజకీయ పటంలో ఆ నిశ్శబ్దం వెనుక యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ఇప్పటివరకు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన ‘స్పేస్ వార్స్’ కాన్సెప్ట్.. ఇప్పుడు క్రమంగా వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. తాజాగా అమెరికా చేసిన ఒక సంచలనాత్మక ప్రకటన విశ్వాంతరాళంలో సరికొత్త వ్యూహాత్మక పోరుకు తెరలేపింది.
తమ వద్ద అంతరిక్షంలో సమర్థవంతంగా పనిచేసే ‘స్పేస్ కంట్రోల్’ ఆయుధ వ్యవస్థలు ఉన్నాయని వాషింగ్టన్ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అని కాదు.. ఏళ్ల తరబడి గోప్యంగా ఉంచిన ఈ సైనిక రహస్యాన్ని ఇప్పుడు ఎందుకు బయటపెట్టారు? అనేదే..
దాడికా.. ఆత్మరక్షణకా?
అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ ఈ విషయాన్ని ధృవీకరించినప్పటికీ ఆ ఆయుధాల రూపం, స్వభావం లేదా సామర్థ్యాలపై ఉద్దేశపూర్వకంగానే గోప్యత పాటించారు. అమెరికా అధికారిక వాదన ప్రకారం.. ఉపగ్రహాలు, మిస్సైల్ వార్నింగ్ సిస్టమ్స్, మిలిటరీ కమ్యూనికేషన్ల లాంటి తమ అత్యంత కీలకమైన ‘స్పేస్ అసెట్స్’ను శత్రుదేశాల ముప్పు నుంచి కాపాడుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.
సైనిక భాషలో చెప్పాలంటే ఇది ‘డిటరెన్స్’ వ్యూహం. అంటే తాము ముందస్తు దాడికి దిగడం కంటే.. "మాపై దాడికి తెగిస్తే తిరిగి కొట్టే సామర్థ్యం మాకుంది" అని ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతం ఇవ్వడం.
చైనా, రష్యాలకు పరోక్ష హెచ్చరిక!
ఈ ప్రకటన వెనుక చైనా, రష్యాల వైపు ఉద్దేశించిన పరోక్ష హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆధునిక యుద్ధరంగంలో భూమిపై పోరాడే బలగాలకంటే అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలే వెన్నుముకగా మారాయి. కమ్యూనికేషన్‌ను కట్ చేసినా గైడెన్స్ సిస్టమ్‌ను జ్యామ్ చేసినా ప్రత్యర్థి భూమిపై మోకాళ్లపై పడక తప్పదు. అందుకే రాబోయే రోజుల్లో ‘స్పేస్ వార్’ అంటే కేవలం ఉపగ్రహాలను క్షిపణులతో పేల్చివేయడం మాత్రమే కాదు. సిగ్నల్స్ జ్యామింగ్ తో ఉపగ్రహాల సమాచారాన్ని నిలిపివేయడం... సైబర్ అటాక్స్ తో శాటిలైట్ నియంత్రణ వ్యవస్థలను హ్యాక్ చేయడం... లేజర్ దాడులతో శత్రు ఉపగ్రహాల సెన్సర్లను గుడ్డివి చేయడం లక్ష్యంగా అమెరికా ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
‘గోల్డెన్ డోమ్’ ప్రతి ప్రతిబింబమా?
అమెరికా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ‘గోల్డెన్ డోమ్’లో అంతరిక్ష ఆధారిత సెన్సార్లు, ఇంటర్‌సెప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు బయటపెట్టిన ‘స్పేస్ కంట్రోల్’ వ్యవస్థలు నేరుగా గోల్డెన్ డోమ్‌లో భాగమా లేదా స్వతంత్ర వ్యవస్థలా అనేదానిపై స్పష్టత లేదు.
అమెరికా తన ఆయుధ శక్తిని ప్రదర్శించడం ద్వారా శత్రువులను నిరోధించవచ్చని భావిస్తున్నప్పటికీ ఇది ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యాలను మరింత వేగంగా ఆయుధ సమృద్ధి వైపు నడిపించే ప్రమాదం లేకపోలేదు. భూమిపై ఆధిపత్యం ఎంత ముఖ్యమో భవిష్యత్ ప్రపంచంలో ‘స్పేస్ ఆధిపత్యం’ అంతకంటే ప్రాణాధారంగా మారబోతోంది. నింగిలో మొదలైన ఈ కొత్త ఆయుధ పోటీ మానవాళికి రక్షణనిస్తుందో లేక కొత్త ప్రమాదానికి నాంది పలుకుతుందో వేచి చూడాలి.