చైనా (X) భారత్: భగభగ మండే కృత్రిమ సూర్యుడి తయారీలో ఢీ అంటే ఢీ
ప్రకృతిలో సూర్యుడు శక్తిని ఉత్పత్తి చేసే అత్యంత శక్తివంతమైన కేంద్రక సంలీన (న్యూక్లియర్ ఫ్యూజన్) ప్రక్రియను భూమిపైనే పునఃసృష్టించేందుకు ప్రపంచ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక పోరు తీవ్రమవుతోంది.
ప్రకృతిలో సూర్యుడు శక్తిని ఉత్పత్తి చేసే అత్యంత శక్తివంతమైన కేంద్రక సంలీన (న్యూక్లియర్ ఫ్యూజన్) ప్రక్రియను భూమిపైనే పునఃసృష్టించేందుకు ప్రపంచ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక పోరు తీవ్రమవుతోంది. ఈ దిశగా పరిశోధనలు చేస్తున్న అగ్రరాజ్యాల జాబితాలో చైనాతో పాటు భారత్ కూడా తన సత్తా చాటుతోంది. అపరిమితమైన, స్వచ్ఛమైన హరిత శక్తిని భవిష్యత్తులో అందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ మహాయజ్ఞంలో ఇరు దేశాలు విభిన్న సాంకేతికతలతో ముందుకు వెళ్తుండటం విశేషం.
భారతదేశం తన అసాధారణ ప్రయోగంలో భాగంగా గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్‌లోని ఎస్.ఎస్.టి-1 టోకామాక్ వ్యవస్థలో సరికొత్త 82.6 GHz, 400 kW గైరోట్రాన్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది. సూర్యుడి కేంద్రకం కంటే సుమారు 20 రెట్లు అనగా 200 మిలియన్ డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను ఉత్పత్తి చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే విజయం సాధించారు. అయితే అంతటి తీవ్రమైన ఉష్ణోగ్రత వద్ద ఉండే అస్థిర ప్లాస్మాను ఎక్కువ సేపు స్థిరంగా ఉంచడమే అసలు సవాల్. ఈ సరికొత్త గైరోట్రాన్ ద్వారా మైక్రోవేవ్ శక్తిని ప్లాస్మాలోకి ప్రవేశపెట్టి.. దానిని సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంచే పరిశోధనల్లో భారత్ కీలక అడుగు ముందుకు వేసింది.
మరోవైపు చైనా కూడా తన `కృత్రిమ సూర్యుడు` (EAST) ప్రాజెక్ట్‌లో భాగంగా భారీ ఇంజనీరింగ్ మైలురాళ్లను సాధిస్తోంది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో 582 టన్నుల బరువున్న భారీ సూపర్‌కండక్టింగ్ మ్యాగ్నెట్‌లను విజయవంతంగా పరీక్షించారు. సూర్యుడి కేంద్రక ఉష్ణోగ్రతను మించిన ప్లాస్మా రియాక్టర్ గోడలకు తగలకుండా గాలిలో సస్పెండ్ చేయడానికి ఈ దిగ్గజ అయస్కాంతాలు అత్యంత కీలకం. చైనా తన దేశీయ పరిజ్ఞానంతోనే ఈ అత్యాధునిక మ్యాగ్నెట్ తయారీని పూర్తి చేయడం గమనార్హం. అంతేకాకుండా తన `ఈస్ట్` టోకామాక్ రియాక్టర్ ద్వారా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను ఏకంగా 1066 సెకన్ల పాటు నిరంతరం నిలకడగా ఉంచి చైనా ప్రపంచ రికార్డు సృష్టించింది. 2027 నాటికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి.. 2030 నాటికి ప్యూజన్ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో చైనా ముందుకు సాగుతోంది.
సాంకేతికత పరంగా పరిశీలిస్తే... చైనా- భారత్ రెండూ కూడా అణు సంలీనం కోసం `టోకామాక్` అనే డోనట్ ఆకారపు రియాక్టర్ డిజైన్‌నే ఉపయోగిస్తున్నాయి. అయితే చైనా తన వ్యూహంలో భాగంగా రియాక్టర్‌కు అవసరమైన 582 టన్నుల D-ఆకారపు సూపర్‌కండక్టింగ్ మ్యాగ్నెట్‌లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో.. స్వయం సమృద్ధి సాధించేలా తయారు చేసుకుంది. ఇవి కేవలం 4 కెల్విన్ (-269 డిగ్రీల సెల్సియస్) అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తూ.. రియాక్టర్ లోపలి 100 మిలియన్ డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. ఇక భారత్ కూడా ఎస్.ఎస్.టి-1 టోకామాక్‌లో హై-ఫ్రీక్వెన్సీ గైరోట్రాన్ సాంకేతికతను మెరుగుపరుచుకుంటూ ప్లాస్మా నియంత్రణపై తన పరిశోధనలను వేగవంతం చేస్తోంది.
ఏది బెస్ట్ అనే కోణంలో చూస్తే.. ప్రస్తుతం మ్యాగ్నెటిక్ కన్ఫైన్‌మెంట్ & ప్లాస్మాను ఎక్కువ కాలం పాటు నిలకడగా ఉంచే సామర్థ్యంలో చైనా తన భారీ మౌలిక వసతులు... స్వదేశీ సప్లై చైన్ బలంతో కొంత ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఫ్రాన్స్‌లో తయారవుతున్న ITER ప్రాజెక్ట్ కంటే మూడు రెట్లు ఎక్కువ శక్తిని నిల్వ చేసే అయస్కాంతాలను చైనా తయారు చేయడం దాని సాంకేతిక ఆధిక్యతకు నిదర్శనం. అయితే తక్కువ ఖర్చుతో పకడ్బందీగా ప్రయోగాలు చేస్తూ.. ప్లాస్మా భౌతిక శాస్త్రంలో భారత్ సాధిస్తున్న విజయాలు కూడా భవిష్యత్తులో సంచలనాత్మక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే... అపరిమిత స్వచ్ఛమైన ఇంధన కొరతను తీర్చగల ఏకైక మార్గంగా భావిస్తున్న `కృత్రిమ సూర్యుడి` తయారీ రేసులో చైనా, భారత్‌లు తమదైన శైలిలో పోటీపడుతున్నాయి. చైనా వేగంగా ఇంజనీరింగ్ అద్భుతాలను ఆవిష్కరిస్తుండగా... భారత్ శాస్త్రీయత పట్టుదలతో ముందడుగు వేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న ఈ ప్రయోగాత్మక పోరు భవిష్యత్తులో ప్రపంచ ఇంధన రంగం ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయడం ఖాయం.