ఎవరికీ తెలియని నరేంద్రుని జీవితం...మోడీ కధలుగా !
ప్రధాని నరేంద్ర మోడీ అంటే అందరికీ తెలుసు. ఆయన పన్నెండేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అంటే అందరికీ తెలుసు. ఆయన పన్నెండేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. అంతకు ముందు 13 ఏళ్ళ పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పాలించారు. మోడీ జీవితంలో ఈ పాతికేళ్ల కాలం ప్రజా జీవితంలో అధికార కార్యకలాపాల్లో సాగింది. అయితే మోడీ వయస్సు 76 ఏళ్ళు. మరి మిగిలిన 51 ఏళ్ల జీవితం ఉంది. కదా మరి ఆ జీవితంలో మోడీ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇంకా చెప్పాలీ అంటే మోడీ బీజేపీలో చేరి ఇప్పటికి నాలుగు దశాబ్దాలు అయింది. దాని కంటే ముందు ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు. అలా మోడీ గురించి దేశానికి తెలియని విషయాలే ఎన్నో ఉన్నాయి. వాటిలో పది వరకూ వాస్తవ అంశాలను ఏర్చి కూర్చి మోడీ కథ పేరుతో ఒక పుస్తకం జనం ముందుకు తీసుకుని వస్తున్నారు. మోడీ పుట్టిన రోజు అయిన ఈ నెల 17న ఆ పుస్తకం ఆవిష్కరణ జరగనుంది.
అందులో ఏముంది :
ఇక మోడీ కథ పేరుతో వస్తున్న పుస్తకంలో ఏముంది అంటే చాలానే ఉంది అంటున్నారు ప్రచురణకర్తలు. ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ రచయిత హరీశ్ చంద్ర బర్నవాల్ రచించారు. ఆయన గతంలో మోదీ సూత్ర మోదీ నీతి లార్డ్ ఆఫ్ రికార్డ్స్ వంటి పుస్తకాలను రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక భరతేందు హరిశ్చంద్ర అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఇక ఈ పుస్తకంలో ఏముంది అంటే మోడీలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించినట్లుగా రచయిత చెప్పారు. మోదీ జీవితంలోని వివిధ సందర్భాలలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా అందులోని అంశాలను ఆ సమయంలో ఆయన చూపించిన కరుణ ఆప్యాయత సున్నితత్వాన్ని తెలియచేసేందుకు ఈ పుస్తకం రాసినట్లుగా వివరించారు.
సామాన్యుడిగా ఉంటూనే :
నరేంద్ర మోడీ బీజేపీలో ఒక పదవిలో ఉంటూ 1990లో చేసిన ఒక రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన ప్రవర్తన కారణంగా ఇద్దరు మహిళా ప్రయాణికులకు రాజకీయ నాయకులపై ఉన్న వ్యతిరేక భావం ఎలా పోయింది వారిని ఆయన వ్యక్తిత్వం ఎలా మార్చింది అన్నది రచయిత ఈ పుస్తకంలో తెలియచేశారు. అలాగే నేపాల్‌కు చెందిన జీత్ బహదూర్ అనే బాలుడిని బీజేపీలో మోడీ సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు చేరదీశారు. అయితే మోడీ ప్రధాని అయ్యాక కూడా అతడిని మర్చిపోకుండా ఉండడమే కాదు ఆలింగనం చేసుకున్న సందర్భాన్ని కూడా రచయిత తన పుస్తకంలో పొందుపరిచారు. అలాగే అంధురాలు అయిన పింకల్ అనే విద్యార్థిని పట్ల చూపిన మోడీ చూపించిన ఆప్యాయత అదే ఆయనలో కొత్త ఆలోచనలు రేకెత్తించి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేసెలా ఎలా చేసిందో కూడా రచయిత పుస్తకంలో పేర్కొన్నారు.
అన్నింటి సమాహారం :
ఇక ఆగ్రాకు చెందిన తైబా అనే అమాయకురాలి ప్రాణాలను కాపాడటానికి మోడీ తక్షణ సహాయం అందించడం కర్ణాటకలోని హుబ్బళ్లి కి చెందిన కార్మికుడు చంద్రకాంత్ వంటి ఎందరో సామాన్యుల కష్ట సుఖాలలో పాలుపంచుకున్న తీరును కూడా ఈ పుస్తకంలో కధలుగా తీసుకుని వచ్చారు. మొత్తానికి రచయిత హరీశ్ చంద్ర బర్నవాల్ ఈ పుస్తకం ద్వారా చెప్పదలచుకున్నది ఏమిటి అంటే మోడీ పాలన అంటే కేవలం విధానాలు ఫైళ్లతో కాదని సమాజంలో ఎంతో చూసి నేర్చుకుని అనుభవించిన తీరుని ఆయన అమలు చేస్తున్నారు అని చెప్పడమే. అట్టడుగున ఉన్న ప్రజల జీవితాలను మోడీ అర్థం చేసుకున్నారు అని చెప్పడం కూడా మోడీ కధ పుస్తకం ఉద్దేశ్యంగా ఉంది. ఈ నెల 17న ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.