బీజేపీకి ఒకే ఒక్క ఓటు...ఇది గిన్నిస్ రికార్డే !

దేశాన్ని ఏలే బీజేపీ, రాజస్థాన్ లో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది ఒక గొప్ప చేదు అనుభవమే.

Update: 2026-09-15 04:13 GMT

దేశాన్ని ఏలే బీజేపీ, రాజస్థాన్ లో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది ఒక గొప్ప చేదు అనుభవమే. నిజానికి వార్డు ఎన్నికలు అంటే తక్కువ ఓట్లే ఉండొచ్చు. కానీ మరీ బొత్తిగా ఒక్క ఓటు ఏంటి స్వామీ అని అంతా విస్తుపోతున్నారు. బీజేపీ తరఫున అక్కడ పోటీ చేసిన అభ్యర్థి కాదు బీజేపీకే ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటున్నారు. ఇంతకీ ఈ వింత జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలోని దిడ్వానా కుచమన్ జిల్లాలోని పర్బత్‌సర్ మున్సిపాలిటీ పరిధిలో గల 13వ వార్డులో. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి ఒక్క ఓటు మాత్రమే దక్కింది. ఇంతకీ ఆయన ఓటు కూడా అది కాదు, ఇంతటి దారుణమైన ఫలితాన్ని బీజేపీ మూటకట్టుకోవడంతో క్షణాలలో ఇది దేశమంతా రాజకీయ వార్త అయింది. సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.

పక్క వార్డు నుంచి :

ఇక 13వ వార్డులో పోటీకి దిగిన కైలాశ్‌చంద్ అయితే అసలు తనకు పక్కనే ఉన్న 12వ వార్డులో ఉంది అని చెప్పారు. పార్టీ ఆదేశానుసారం తాను పోటీకి దిగాను అని చెప్పారు. అయితే తనకు 13వ వార్డులో ఎవరో ఓటు వేశారు అని ఆయన చెప్పడం విశేషం. ఇక తన ఓటు కూడా వేసుకునే వీలు లేకపోవడంతో సింగిల్ ఓటు దక్కింది అంటున్నారు. మరి ఆయన ఓటు కూడా కలిపితే ఒకటి రెండు అవుతుంది తప్పించి అంతకు మించి ఏమి జరుగుతుందని రాజకీయ ప్రత్యర్ధులు అంటున్నారు. ఇక ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి హీనా ఖాన్ 376 ఓట్ల రావడంతో ఘన విజయం సాధించారు. సహజంగా రెండో ప్లేస్ లో ఉండాల్సిన బీజేపీ ఒక్క ఓటు తెచ్చుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి రషీద్ ఖాన్ 195 ఓట్లతో రెండో స్థానంలో నిలవడం విశేషం.

హోరా హోరీలో కాంగ్రెస్ :

ఇదిలా ఉంటే పర్బత్‌సర్ మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. ఇందులో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకుని క్లియర్ కట్ మెజారిటీని సాధించింది. బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించి అధికారానికి దూరం అయింది. మొత్తంగా చూస్తే రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా 309 పట్టణ స్థానిక సంస్థల్లోని 10,000కు పైగా కౌన్సిలర్ పదవులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇందులో అధికార బీజేపీ మొత్తం మీద ఆధిక్యత సాధించింది.

ఫలితాలు ఆసక్తికరం :

ఇక ఒక్క ఓటుతో వార్డుని కోల్పోయినా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలనే సాధిస్తోంది. రాజస్థాన్‌లో పది మున్సిపల్ కార్పొరేషన్లు, 47 మున్సిపల్ కౌన్సిళ్లు 252 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో జైపూర్, కోటా, ఉదయపూర్ భిల్వారా మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ స్పష్టమైన మెజారిటీని సాధించగా అల్వార్‌లో ఆధిక్యంలో ఉంది. ఇక బికనేర్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది, అలాగే అజ్మీర్ పాలిలలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. భరత్‌పూర్‌లో స్వతంత్ర అభ్యర్థులు ఘనవిజయం సాధించి, మొత్తం 65 వార్డులలో 38 స్థానాలను గెలుచుకున్నారు. అదే విధంగా జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 100 స్థానాలకు బీజేపీ కాంగ్రెస్ చెరో 44 స్థానాలను గెలుచుకున్నాయి. 47 మున్సిపల్ కౌన్సిళ్లలో, బీజేపీ 21 చోట్ల ఆధిక్యం సాధించగా, కాంగ్రెస్ 17 చోట్ల ముందుంది. అదేవిధంగా, 252 మున్సిపాలిటీలలో బీజేపీ 144 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ 92 స్థానాల్లో విజయం సాధించింది.

కాంగ్రెస్ పుంజుకుంది :

మరోవైపు రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన పూర్తి అధికార బలన్ని ఉపయోగించినప్పటికీ ఆశించిన ప్రజా తీర్పును పొందడంలో విఫలమైందని అన్నారు. తమ పార్టీ పుంజుకుందని చెప్పారు. ఇక చూస్తే మొత్తం 309 పట్టణ స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 9 11 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరిగింది

Tags:    

Similar News