యూసీసీకి నో ...బీజేపీకి జేడీయూ గట్టి షాక్
బీజేపీకి మిత్రుల నుంచి గట్టి షాక్ తగలడం ఇదే మొదటి సారి అనుకోవాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రెండు ఊత కర్రలు అవసరంగా ఉన్నాయి.
బీజేపీకి మిత్రుల నుంచి గట్టి షాక్ తగలడం ఇదే మొదటి సారి అనుకోవాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రెండు ఊత కర్రలు అవసరంగా ఉన్నాయి. అందులో ఒకటి ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు అయితే రెండవది బీహార్ కి చెందిన జేడీయూ పార్టీకి చెందిన 12 మంది ఎంపీల బలం. 2024 లో నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని అయ్యారు అంటే ఈ రెండు పార్టీల వల్లనే అన్నది అందరికీ తెలిసిందే. ఇక రెండేళ్లకు పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీహార్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ కొనసాగారు. అయితే 2025 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కాంబో గెలిచాక ఆరు నెలలు కూడా గడవకముందే నితీష్ కుమార్ ని దించేసి బీజేపీ తమ పార్టీకి చెందిన సామ్రాట్ చౌదరిని సీఎం గా చేసింది.
నితీష్ మాజీ సీఎం గానే :
ఆ విధంగా బీహార్ ని ఏలే అవకాశాన్ని మొదటి సారి అందుకుంది. అదే సమయంలో నితీష్ కుమార్ రాజ్యసభకు నెగ్గారు. ఆయనకు ఇలా వస్తే చాలు అలా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అది కూడా కీలకమైనదిగా ఉంటుందని ప్రచారం అయితే సాగింది. కానీ నితీష్ కి ఉన్న సీఎం పదవి పోయింది కానీ కేంద్ర మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఆరు నెలలు గడుస్తున్నా నితీష్ రాజకీయ దశ మారలేదు. ఆయన మాజీ సీఎం గానే మిగిలిపోయారు. నిజానికి జేడీయూకి నితీష్ ని బీహార్ నుంచి కదపడం అసలు ఇష్టం లేదు, అయితే బీజేపీ నుంచి ఒత్తిడి రావడంతో పోనీ కేంద్రంలో అయినా తమ నేత మంచి పదవిలో ఉంటారని అనుకుంది. కానీ అది ఎన్నటికీ తీరడం లేదు. దాంతో ఆ ఆవేశం ఆక్రోశం జేడీయూ ఒక వైపు అణచుకుంటోంది. ఇపుడు తగిన సమయం చూసి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేసింది అని అంటున్నారు.
బీహార్‌లో ఉమ్మడి పౌరస్మృతికి నో :
ఇదిలా ఉంటే దేశంలోని 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాలలో యూసీసీ అమలు చేయాలని బీజేపీ చూస్తోంది. తమ సొంత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలతో పాటు మిత్రులు ఉన్న రాష్ట్రాలలో కూడా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దాని మీద ఇండియా కూటమి నుంచి ఒక వైపు విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇపుడు ఏకంగా గట్టి మిత్రుడే జేడీయూ భారీ షాక్ ఇచ్చేసింది. బీహార్ లో యూసీసీని అమలు చేయబోమని జేడీయూ స్పష్టం చేసింది. పార్లమెంటులో బిల్లుకు మద్దతిచ్చినా రాష్ట్రంలో అంగీకరించేది లేదని జేడీయూ పెద్ద తిరకాసు పెట్టింది. అంతే కాదు ఇదే విషయంపై నితీశ్ కుమార్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని జేడీయూ నేతలు చెబుతున్నారు.
బీహార్ కూటమిలో భిన్న స్వరాలు :
బీహార్ ఎన్నికల్లో ఒక్కటిగా నిలిచి గెలిచిన బీజేపీ జేడీయూ ఇప్పుడు అత్యంత కీలకమైన యూసీసీ అంశం మీద విడిపోయారు అని అంటున్నారు. బీజేపీకి ఉమ్మడి పౌర స్మృతి చాలా కీలకంగా ఉంటుంది. ఆ పార్టీ అజెండాలో ఇది అతి ముఖ్యమైనదిగా చూస్తారు. అందుకే 2029 నాటికి దేశంలో మూడొంతుల రాష్ట్రాలలో అమలు చేస్తామని ధీమాగా ప్రకటించింది. అయితే దానికి బీహార్ లోనే తొలి గండి పడుతోంది. జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ దీని మీద మాట్లాడుతూ పార్లమెంటులో బిల్లుకు మద్దతు పలికినప్పటికీ, బీహార్‌లో యూసీసీ అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పడంతో అసలు బీహార్ లో ఏమి జరుగుతోంది అని అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక బీహార్ లో అయితే బీజేపీ జేడీయూ ప్రభుత్వం ఉంది. దాని మీద కూడా జేడీయూ నేత శ్యామ్ రజక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో తాము కూడా ఉన్నామని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. దీని మీద ప్రతిపక్ష ఆర్జేడీ కూడా బీజేపీని నిందిస్తోంది. దేశంలో ద్వేష రాజకీయాలకు తావు లేదని పేర్కొంది.