మోడీతో వాంగ్ చుక్ 'డీల్' : ఏంటీ ట్రోల్స్!
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో జవాబు దారీ తనం కోరుతూ.. కాక్రోచ్ జనతాపార్టీ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో జవాబు దారీ తనం కోరుతూ.. కాక్రోచ్ జనతాపార్టీ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉద్యమానికి.. జమ్ము కశ్మీర్‌లోని లద్ధాక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావంతుడు, సామాజిక నేత సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ దీక్షకు దిగారు. దాదాపు 26 రోజులు ఆయన దీక్షలోనే ఉన్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా.. ఆయన వినిపించుకోలేదు. మొత్తానికి కేంద్రం జోక్యం చేసుకుని.. మంత్రులను రంగంలోకి దింపాక రెండు కీలక హామీలతో ఆయన దీక్ష విరమించారు.
60 ఏళ్ల వాంగ్ చుక్ 26 రోజుల పాటు దీక్ష చేయడం సాధారణ విషయమేమీ కాదు. అయితే.. ఆయన దీక్షను ప్రశంసించినవారు.. ఆయన విరమణ చేసిన తర్వాత.. ట్రోల్స్ చేస్తుండడం గమనార్హం. ప్రధానంగా మూడు అంశాలను విమర్శకులు లేవనెత్తుతున్నారు.
1) ప్రధాని నరేంద్ర మోడీతో వాంగ్ చుక్‌కు డీల్ కుదిరిందని ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన దీక్షను విరమించారని పేర్కొంటున్నారు.
2) విద్యార్థుల కోసం దీక్ష చేపట్టిన వాంగ్ చుక్.. కేంద్ర మంత్రుల సమక్షంలో విరమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
3) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టిన సోనమ్.. ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోకపోయినా.. దీక్షను ఎందుకు విరమించారన్నది మరో కీలక ప్రశ్న. ఈ మూడు అంశాలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని టీవీ చానెళ్ల చర్చలో కూడా ఇవే విషయాలు చర్చకు వచ్చాయి. అయితే.. నిజానికి సోనమ్ దీక్షను ఎవరూ శంకించే అవకాశం లేదు. ఆయన ఈ వయసులో దీక్షకు దిగడం అంటే.. నిజానికి ఎంతకైనా తెగించే ఆయన దిగారనడంలోనూ సందేహం లేదు.
ఇక, ఈ విషయాలపై సోనమ్ స్పందించారు. తాను ఎంత నిజాయితీగా దీక్ష చేపట్టానో నిరూపించుకోవాల్సిన అవసరం ఒకరితో సర్టిఫికెట్లు ఇప్పించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. అంతేకాదు.. తాను మంత్రుల సమక్షంలో దీక్ష విరమించడాన్ని తప్పుకాదని పేర్కొన్నారు. అందరూ భావించినట్టు తాను జంతర్ మంతర్ వద్దదీక్ష విరమించేందుకు ప్రయత్నించానని.. కానీ, శాంతి భద్రతల ముప్పు మరింత పెరగదా? ఉద్రిక్తతలు పెరగవా? అని ఆయన ప్రశ్నించారు. ఇక, కేంద్ర మంత్రితో రాజీనామా చేయించకపోతే.. అది మోడీకే ప్రమాదమన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. కాబట్టి దీని కోసం కాకుండా.. విద్యార్థులపై కేసులు, వేధింపులు లేకుండానే తాను చూసుకున్నానని పేర్కొన్నారు. ఆమేరకు కేంద్రం నుంచి హామీ పొందానని వివరణ ఇచ్చారు.