నాలుగు కోట్ల ఆంధ్రులు.. ఏపీలో కొత్త ఓట్ల లెక్క ఇదే..
ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ - SIR) ప్రక్రియ ముగిసింది. ఈ సర్వేకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ కీలక వివరాలను అధికారికంగా వెల్లడించారు.
ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ - SIR) ప్రక్రియ ముగిసింది. ఈ సర్వేకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ కీలక వివరాలను అధికారికంగా వెల్లడించారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694 గా నమోదైందని సీఈఓ ప్రకటించారు. గత ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించిన అనంతరం తుది సంఖ్యను ఖరారు చేశారు. ప్రస్తుతం ఓట్లు తొలగించిన వారు, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన వారు సరైన ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సీఈవో సూచించారు.
ఇంటింటి పరిశీలనలో భాగంగా జాబితాలో అర్హత లేని, తప్పుగా నమోదైన వివిధ కేటగిరీల ఓట్లను అధికారులు గుర్తించి తొలగించారు. ఈ తొలగింపు ప్రక్రియలో అత్యధికంగా సరైన అడ్రస్ లేని ఓటర్లే పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 44,89,488 మంది ఓటర్లకు సంబంధించి సరైన చిరునామా లభించలేదని సీఈఓ తెలిపారు. ఇది కాకుండా మరణించిన ఓటర్ల సంఖ్య 15,22,174గా ఉండగా, మరో 14,43,886 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు. అలాగే విచారణ సమయంలో ఎలాంటి ఆచూకీ దొరకని ఓటర్ల సంఖ్య 7,77,885గా తేలింది. ఇవి కాకుండా ఇతరత్రా కారణాల వల్ల మరో 8,327 మంది ఓట్లు తొలగింపునకు గురయ్యాయని వివరించారు. మరోవైపు ఈ సర్వే జరుగుతున్న కాలంలోనే వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 7,37,216గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
సర్ ప్రక్రియలో వివిధ కారణాల వల్ల ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిపోయిన అర్హులైన నిజమైన ఓటర్లు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం భరోసా కల్పించింది. అర్హత ఉండి జాబితాలో పేరు గల్లంతైన వారు, సర్వే సమయంలో గైర్హాజరైన వారు మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోందని వివేక్ యాదవ్ ప్రకటించారు. అర్హత ఉన్న వారు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.