మోడీ కేబినెట్ నో అన్నా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. కారణం ఇదీ

యువశక్తే ఈ దేశానికి అసలైన బలమని, విద్యార్థులు తమ విలువైన సమయాన్ని ఆందోళనల్లో కాకుండా చదువుపై కేటాయించాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు ప్రధాన్ తెలిపారు.

Update: 2026-07-25 09:41 GMT

దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీయే ప్రభుత్వంలో ఊహించని రీతిలో రాజకీయం వేడెక్కింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల ఒత్తిడి మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేబినెట్ పెద్దలు "వద్దు" అని వారించినప్పటికీ ఆయన తన నిర్ణయానికే కట్టుబడి రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపించారు. నీట్ వివాదంలో సీజేపీ విధించిన మధ్యాహ్నం డెడ్‌లైన్ ముగిసే సమయానికి మరో విడత చర్చలు జరగాల్సి ఉండగానే ప్రధాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

'ఎక్స్' వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగ పోస్ట్

తన రాజీనామాను ధృవీకరిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ 'ఎక్స్' వేదికగా ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. దేశ యువత భవిష్యత్తు, ఆకాంక్షలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. "గత పది రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నీట్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాం. ఎలాంటి భేషజాలకు పోకుండా విజయవంతంగా మళ్లీ పరీక్షను కూడా నిర్వహించాం. కానీ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను." అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

రాజీనామా వెనుక అసలు కారణాలు?

యువశక్తే ఈ దేశానికి అసలైన బలమని, విద్యార్థులు తమ విలువైన సమయాన్ని ఆందోళనల్లో కాకుండా చదువుపై కేటాయించాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు ప్రధాన్ తెలిపారు. బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పుకోలేదని, మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూనే పదవిని త్యాగం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఇన్నాళ్లూ విద్యాశాఖ బాధ్యతలు అప్పగించి, దేశసేవకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ

నీట్ పేపర్ లీకేజీ అంశం పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ తీవ్ర దుమారం రేపింది. విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలు ఉధృతం చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మోడీ కేబినెట్ వద్దని చెప్పినా ప్రధాన్ రాజీనామా చేయడం వెనుక తీవ్రమైన తెరవెనుక రాజకీయాలు నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News