జ‌గ‌న్‌-2.0.. స‌ర్వం ఇదేనా.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన సూప‌ర్ యాప్‌.. జ‌గ‌న్‌-2.0పైనే ఆ పార్టీ ఆశ‌లు పెట్టుకున్నట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Update: 2026-07-25 09:37 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన సూప‌ర్ యాప్‌.. జ‌గ‌న్‌-2.0పైనే ఆ పార్టీ ఆశ‌లు పెట్టుకున్నట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ యాప్‌ను పార్టీ ప‌రంగా తీసుకువ‌చ్చిన నేప‌థ్యంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయకుల‌కు యాప్ విశేషాల‌ను వివరిస్తున్నారు. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ కార్యాల‌యాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూడా ఈ యాప్‌పైనే ఎక్కువ‌గా వివ‌రిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను పిలిచి మ‌రీ యాప్‌కు సంబంధించి వివ‌రాలు తెలియ‌జేయ‌డంతో పాటు.. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చూస్తున్నారు.

త‌ద్వారా జ‌గ‌న్‌-2.0 యాప్‌ను పార్టీ అత్యంత కీల‌కంగా భావిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంతేకాదు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు కానీ.. నాయ‌కులు కానీ.. కేంద్ర కార్యాల‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్‌-2.0 డౌన్ లోడ్ చేసుకున్నారా? మీ ప్రాంతంలో ఎంత మందితో డౌన్ లోడ్ చేయించారు? అంటూ.. పార్టీ కీల‌క నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్నా రెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. గ‌తంలో మాదిరిగా ఇత‌రులు ఎవ‌రూ ఈ యాప్‌లో జొర‌బ‌డ‌కుండా (వైసీ పీ నేత‌ల మాట ప్ర‌కారం) కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇక‌, ఈ యాప్ ద్వారా కార్య‌క‌ర్త‌ల‌ను బ‌లోపేతం చేయాల‌న్న‌ది ప్ర‌ధాన ఉద్దేశంగా క‌నిపిస్తోంది. పార్టీ త‌ర ఫున చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను కూడా దీనిలో అప్‌లోడ్ చేయ‌నున్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ నుంచి వెళ్లే సూచనలు, స‌ల‌హాలు.. ఆదేశాలు కూడా వీటిలోనే ఉంటాయి. అలానే.. కార్య‌క‌ర్త‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌ను కూడా దీనిలో ప్ర‌స్తావించ‌నున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ అనుస‌రిస్తున్న మై టీడీపీ యాప్‌కు స‌రిస‌మానంగా దీనిని అమ‌లు చేయాల‌న్న‌ది వైసీపీ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

ప్ర‌యోజ‌నం ఎంత‌..?

ఇక‌, ప్ర‌యోజ‌నం విష‌యానికి వస్తే.. కేవ‌లం యాప్ ద్వారానే పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల‌.. మె జారిటీ కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ కార్య‌క్ర‌మాలు చేరువ అయ్యే అవ‌కాశం త‌క్కువుగా ఉంటుంద‌న్న అభిప్రాయం ఉంది. అలానే.. గ్రామీణ ప్రాంతాల్లోని కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఈ యాప్ ఏమేర‌కు చేరువ అవుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. అయితే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ దిశ‌గా అడుగులు వేసిన‌ట్టు తెలుస్తోంది. ఇది త‌మ‌కు మేలు చేస్తుంద‌ని కొంద‌రు.. కానీ, దీనికి మించి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తేనే మేలు జ‌రుగుతుంద‌ని మ‌రికొంద‌రు నేత‌లు చెబుతున్నారు.

Tags:    

Similar News