ఐదు రోజుల్లో మాజీ మంత్రి రోజా అరెస్టు?
ఆడుదాం ఆంధ్ర స్కాంపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు గత నెలలోనే డీజీపీకి నివేదిక అందజేశారు.;
మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజాను ఈ వారంలో అరెస్టు చేసే అవకాశం ఉందా? శాప్ చైర్మన్ రవినాయుడు చెబుతున్న ప్రకారం రోజాను మరో ఐదు రోజుల్లోనే అరెస్టు చేస్తారని అంటున్నారు. అయితే శాప్ చైర్మన్ చెప్పినట్లు రోజా అరెస్టు జరుగుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆడుదాం ఆంధ్రా స్కాంలో ప్రజా ధనం దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ప్రభుత్వంలో రోజా క్రీడా మంత్రిగా ఉండగా, రూ.119 కోట్లతో ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాపోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల పేరుతో రోజా ప్రోత్సాహంతో రూ.40 కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రభుత్వం, టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా శాప్ చైర్మన్ రవినాయుడు, మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఆర్డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇక ఈ స్కాంపై రవినాయుడు ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
ఆడుదాం ఆంధ్ర స్కాంపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు గత నెలలోనే డీజీపీకి నివేదిక అందజేశారు. క్రీడా పరికరాల కొనుగోలు, క్రీడాకారులకు వసతి పేరుతో దాదాపు రూ.40 కోట్ల మేర అక్రమాలు జరిగాయని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి రోజా ప్రమేయంపై కీలక ఆధారాలను విజిలెన్స్ సమర్పించినట్లు చెబుతున్నారు. దీంతో త్వరలో రోజాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే మహిళా నేతను అయిన తనను అరెస్టు చేసే సాహసం ప్రభుత్వం చేయదని రోజా ధీమా వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, రోజా అవినీతి వ్యవహారంపై విజిలెన్స్ స్పష్టమైన ఆధారాలు సేకరించినందున ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేస్తున్నారు. రోజాతోపాటు నాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వారంలోనే అరెస్టులు అంటూ జరుగుతున్న ప్రచారం రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పలు రకాల కేసుల్లో వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టు జరుగుతోంది. అయితే మాజీ మంత్రి రోజా అరెస్టుపై టీడీపీ, జనసేన కార్యకర్తల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని అంటున్నారు.
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ శ్రేణులు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఇలా అప్పట్లో నోరు పారేసుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి, వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇదేవిధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు కొడాలి నాని, రోజాలను అరెస్టు చేయాలని ఎప్పటి నుంచో పావులు కదుపుతోందని అంటున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల కొడాలి పేరును కాస్త వెనక్కి పెట్టి, ముందు రోజాకు అరదండాలు వేసే దిశగా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని అంటున్నారు. అయితే విజిలెన్స్ నివేదికను ఆధారంగా చేసుకుని ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారా? లేక సీఐడీ ద్వారా అరెస్టుకు చర్యలు తీసుకుంటారా? అనేది చర్చకు తావిస్తోంది. ఇదే సమయంలో రోజాను అరెస్టు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సివుంటుంది. గవర్నర్ అనుమతి లేనిదే మాజీ మంత్రిని అరెస్టు చేసే అవకాశాలు లేనందున ప్రభుత్వ నిర్ణయం కొన్నాళ్లు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.