కేసీఆర్, రేవంత్ కుమ్మక్కు.. కేంద్ర మంత్రి బండికి అనుమానం?

ఫోన్ ట్యాపింగు కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యానించారు.;

Update: 2025-08-08 14:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా అనేక విచారణలకు ఆదేశించింది. పదేళ్ల పాలనలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అవినీతి చేసిందని ఆరోపిస్తూ వచ్చింది కాంగ్రెస్. అంతేకాకుండా కాళేశ్వరం విచారణ కమిషన్ రిపోర్టు ద్వారా కేసీఆర్ ను బోనులో నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేసి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్ ఉట్టి డ్రామాగా కొట్టిపడేస్తున్నారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగు కేసులో తొలి బాధితుడిని తానేనంటూ చెబుతున్న బండి శుక్రవారం సిట్ ఎదుట వాంగ్మూలమిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

సిట్ కు అధికారాలు లేవా?

ఫోన్ ట్యాపింగు కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యానించారు. విచారణతో కాలయాపన తప్ప ఇంకే ప్రయోజనం లేదని ఆయన నిట్టూర్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ఆరోపణలు గుప్పించారు బండి. అధికారం అడ్డం పెట్టుకుని గతంలో బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఆ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. అదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో ఎందరో ఫోన్లు ట్యాప్ అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లల సంభాషణలు వినడమే కాకుండా, కేసీఆర్ కుమార్తె కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పడం ద్వారా ఆ కుటుంబంలో ఇప్పటికే మండుతున్న మంటలను మరింత రాజేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.

అందరూ ట్యాపింగ్ బాధితులేనా?

సమాజంలో అన్నివర్గాల ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్ చేసిందని, వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఈ కేసును తేల్చేపని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని బండి సంజయ్ చెప్పారు. అయితే కేసు దర్యాప్తును ఈడీకి అప్పగించాలని ఆయన సూచించడం ద్వారా ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తనకు తానుగా ఈడీకి లేఖ రాయాలని బండి కోరుకుంటున్నారు. ఆయన ఇలా కోరుకోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి విచారణ అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా చేతులు కట్టేసుకోలేదన్న అంచనాతోనే ఆయన ఈ ప్రతిపాదన చేశారంటున్నారు.

ద్విముఖ వ్యూహంతో బండి

తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఫోన్ ట్యాపింగ్ బాధితులే అని ఎత్తిచూపడం ద్వారా బీఆర్ఎస్ ను విలన్ చేస్తున్న బండి సంజయ్.. అదే సమయంలో కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే వ్యూహానికి పదును పెట్టడం ఆసక్తిరేపుతోంది. ఫోన్ ట్యాపింగు కేసులో బాధితులకు కాంగ్రెస్ న్యాయం చేయలేదని చెప్పడం ద్వారా బీజేపీయే ప్రత్యామ్నాయమని, తామే న్యాయం చేయగలమని బండి సంజయ్ సంకేతాలిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగు కేసులో వాంగ్మూలమివ్వడానికి వెళ్లిన ఆయన కేసీఆర్ కూతురుతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పడం ద్వారా అటు ఇంట్లోనూ ఇటు పార్టీలోనూ కల్లోలం రేపాలని పథకం వేశారంటున్నారు.

Tags:    

Similar News