సీఎం ఓకే.. డిప్యూటీ సీఎంకే అస‌లు ప‌రీక్ష‌.. కాంగ్రెస్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

మ‌రి మిగిలిన నాయ‌కులు ఊరుకుంటారా? సీఎం సీటు వ‌దులుకున్నా.. డిప్యూటీ సీఎం కోసం ప‌ట్టుబ‌డుతున్నారు.;

Update: 2023-12-06 12:44 GMT

తెలంగాణ‌లో ప‌దేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత‌.. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డం... కొంత ఇబ్బంది అయినా.. మొత్తానికి ఈ స‌మ‌స్య‌ను సునాయాసంగానే దాటేసింది. ఎంతో మంది సీనియ‌ర్లు, పార్టీ కోసం.. ఎంతో కృషి చేసిన‌వారు ఉన్నా ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పార్టీ ముందుండి న‌డిపించి.. అధికారంలోకి తెచ్చార‌న్న ఏకైక కార‌ణంతో రేవంత్‌కు ప‌ట్టం క‌ట్టేశారు. మ‌రి మిగిలిన నాయ‌కులు ఊరుకుంటారా? సీఎం సీటు వ‌దులుకున్నా.. డిప్యూటీ సీఎం కోసం ప‌ట్టుబ‌డుతున్నారు.

మాకు మాత్రం త‌క్కువా! అంటూ.. ఈ డిప్యూటీ సీఎం సీటు కోసం.. చాలా మంది నాయ‌కులు రెడీ అయ్యారు. వీరిలో సామాజిక స‌మీర‌ణ‌లు.. మైనారిటీ ఈక్వేష‌న్లు.. ఇలా అనేకం ఉన్నాయి. ఇక‌, మ‌హిళా సెంటిమెంటు, గిరిజ‌న సానుభూతి ఇలా అనేక అంశాలు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో ఎవ‌రికి ఈ పీఠం ద‌క్కుతుంది? అధిష్టానం ఎవ‌రికి మొగ్గుతుంది? అనేది విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

వీరే ఆశావ‌హులు..

ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ డిప్యూటీ సీఎం పదవులను ఆశిస్తున్నారు.

+ కోటాల విష‌యానికి వ‌స్తే.. ఎస్సీ కోటాలో దామోదర రాజనర్సింహ, ఎస్టీ కోటాలో సీతక్క మైనార్టీ కోటాలో అయిన షబ్బీర్ అలీ ఉపముఖ్యమంత్రి పదవికి తన పేరును పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు.

+ బీసీల్లో నలుగురు ఐదుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటంతో అందులో తమను ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఒకరిద్దరు అధిష్టానికి విన్నవించార‌ని స‌మాచారం. వీరిలో పొన్నం ప్ర‌భాక‌ర్‌కు అధిష్టానంతో ద‌గ్గ‌ర సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్న నేతలు అందరూ సీనియర్లే కావడంతో ఈ అంశాన్ని ఎలా డీల్ చేయాల‌న్న‌ది పార్టీకి త‌ల‌కుమించిన భారంగా మారింది.

Tags:    

Similar News