బీజేపీకి కౌంటర్ స్లోగన్ అందుకున్న రాహుల్
బీజేపీకి ఒకటి ఎపుడూ ముద్దు అని రాజకీయ పరిశీలకులు అంటారు. అఖండ భారతం ఆ పార్టీ ఫిలాసఫీ. చుట్టు పక్కన ఉన్న చిన్న దేశాలు అన్నీ కలసి ఒకే దేశంగా ఉండాలని అంతా అంటుంది.;
బీజేపీకి ఒకటి ఎపుడూ ముద్దు అని రాజకీయ పరిశీలకులు అంటారు. అఖండ భారతం ఆ పార్టీ ఫిలాసఫీ. చుట్టు పక్కన ఉన్న చిన్న దేశాలు అన్నీ కలసి ఒకే దేశంగా ఉండాలని అంతా అంటుంది. ఒక్కటే రేషన్ అని సైతం అన్నది. వన్ ఎలక్షన్ అని కూడా జమిలి ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఇక దేశంలో ఒకే పార్టీ చిరకాలం అధికారంలో ఉండాలని అని బయటకు అనదు కానీ కోరిక మాత్రం అదే అని ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తూ ఉంటారు. అలాంటి బీజేపీకి ఆంతా ఆల్ ఇన్ వన్ అంటున్న కాషాయం పెద్దలకు అదే భాషలో అదే పొలిటికల్ లాంగ్వేజ్ లో కౌంటర్ స్లోగన్ తో షాక్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.
వన్ మాన్ వన్ ఓట్ అంటూ :
ఇది శ్రీమాన్ రాహుల్ గాంధీ అందుకున్న కొత్త స్లోగన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే బాగుంది కానీ వన్ మాన్ వన్ ఓట్ అంటే బాలేదా అని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అచ్చ తెలుగులో చెప్పాలీ అంటే ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్నది తమ నినాదమని రాహుల్ గాంధీ అంటున్నారు. మరి ఈ దేశంలో ధనవంతుడికి అయినా పేదకు అయినా ఒక్కరికి ఒక్క ఓటే కదా ఎవరైనా అనవచ్చు. అంతేగా అలాగేగా జరుగుతోంది అని అనవచ్చు. కానీ అలా జరగడం లేదు అన్నదే కదా తమ పోరాటం అని రాహుల్ గాంధీ అంటున్నారు. వేరు వేరు పేర్లతో ఫేక్ ఐడీలతో చాలా ఓట్లు ఒకరి పేర్ల మీదనే ఉంటున్నాయని ఆయన అంటూ ఉద్యమిస్తున్నారు.
బీజేపీకే డైరెక్ట్ ఎటాక్ :
నిజానికి ఈసీ మీద పోరాటం అని అంటున్నా అసలైన రాజకీయ పోరాటం మాత్రం బీజేపీ మీదనే. ఈ సంగతి అందరికీ తెలుసు. బీజేపీ వరుస విజయాలను దేశంతో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా సాధిస్తోంది. అయితే అవన్నీ ప్రజాభిప్రాయం పూర్తిగా కాషాయం ప్రతిబించి వచ్చిన ఫలితాలు కానే కావని కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్ర పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల చోరీతోనే ఈ విజయాలు దక్కుతున్నాయని బలంగా చెప్పదలచారు. అయితే ఇందులో కూడా పదునైన వ్యూహం ఉంది అని అంటున్నారు.
ఎంతలా చర్చ జరిగితే అంతలా మేలు :
అవును ఈ దేశంలో బీజేపీ విజయాల వెనక ఏదో వ్యూహం ఉందన్న అభిప్రాయాన్ని జనాల్లోకి బలంగా పంపించడం ద్వారానే కమలానికి దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. నిజంగా చూస్తే కనుక ప్రతీ ఎన్నికలో చిన్నా చితకా ఇబ్బందులు తప్ప సవ్యంగానే అంతా జరుగుతుంది అని అంటారు. కానీ ఇపుడు చాలా పెద్ద విషయాలే జరిగాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పదలచారు. తద్వారా బీజేపీ రాజకీయ ప్రతిష్టను ఆయన సవాల్ చేస్తున్నారు. బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న మోడీ ఇమేజ్ కే పరీక్ష పెడుతున్నారు.
బీహార్ తోనే తేలుతుందా :
ఈ రాజకీయ రచ్చకు ముగింపు ఏమిటి అంటే ఈ ఏడాది నవంబర్ లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలే అని అంటున్నారు. అక్కడ కనుక తిరిగి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మాత్రం రాహుల్ గాంధీ ఈసీ మీద చేసిన ఆరోపణలు కానీ బీజేపీతో ముడిపెట్టి సంధిస్తున్న విమర్శలు కానీ అన్నీ పూర్వపక్షం అవుతాయి. అలా కాకుండా ఇండియా కూటమి గెలిస్తే మాత్రం చూశారా మా ఉద్యమం వల్లనే ఇలా ప్రజాభిప్రాయాన్ని సాధించగలిగామని గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇది 2026లో జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించేందుకు వీలు ఉంటుంది. మొత్తానికి రాహుల్ అండ్ కో గురి పెడుతున్న ఈ నయా స్ట్రాటజీ బీజెపీని మిత్రులను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.