భారత ఐటీ- ఫార్మా వెనకబాటును నిలదీసిన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్
| భారత ప్రైవేట్ రంగం అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడటానికి ఆవిష్కరణలు, పరిశోధనలపై తగినంత దృష్టి లేకపోవడమే కారణమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీలు సొంత ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయాలని, ఫార్మా సంస్థలు జనరిక్ మందులకే పరిమితం కాకుండా కొత్త ఔషధాలపై పరిశోధనలు చేయాలని సూచించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి స్వతంత్ర వ్యూహం అవసరమని పేర్కొన్నారు.
ఇన్నోవేషన్ లేనిదే మిరాకిల్స్ జరగవు! భారతదేశంలో ప్రయివేట్ రంగం ప్రపంచ మార్కెట్లో ఇంకా తీసికట్టుగానే ఉందనేది ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం. పొరుగున దాయాది దేశం చైనా ముందు ప్రపంచ దేశాలే దిగదుడుపుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారతదేశ ప్రయివేట్ రంగంలోని ఐటీ, ఫార్మా సహా పలు రంగాలపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చగా మారాయి.
భారత ప్రైవేట్ రంగం అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు ఆశించిన స్థాయిలో రాణించడం లేదని.. ఆవిష్కరణలపై దృష్టి పెట్టకుండా కేవలం దేశీయ మార్కెట్‌లో లాభాలతోనే ఎందుకు సంతృప్తి చెందుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. ఇటీవల `డీకోడర్` కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో మాట్లాడుతూ ఆయన భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రైవేట్ పెట్టుబడులు.. ఐటీ అండ్ ఫార్మా రంగాల తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మారకపోవడానికి కారణం.. ముందున్న పాత మనస్తత్వానికి భారత వ్యాపార రంగం మళ్లీ వెనక్కి తిరోగమిస్తున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం ప్రారంభ దశలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారత ఐటీ దిగ్గజాలు ఎందుకు వెనుకబడ్డాయని రఘురామ్ రాజన్ నిలదీశారు. ప్రస్తుతం ఈ కంపెనీలు ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి విదేశీ టూల్స్‌ను వాడుకుంటూ వెనుకబడిన స్థానాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని.. కానీ సొంతంగా ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడంలో ఎందుకు ముందుండలేకపోయాయని ప్రశ్నించారు. ఏఐ అభివృద్ధికి ఖర్చు ఎక్కువవుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. అమెరికా మోడళ్లను విశ్లేషించి చైనా చాలా తక్కువ ఖర్చుతో సొంత ఏఐ మోడళ్లను తయారు చేసిందని.. మనం కనీసం ఆ స్థాయి ప్రయత్నాలు కూడా ఎందుకు చేయడం లేదని ఆయన చురకలంటించారు.
భారత ఫార్మాస్యూటికల్ రంగాన్ని చైనాతో పోలుస్తూ రంగరాజన్ కీలక విశ్లేషణ చేశారు. ఈ శతాబ్దం ప్రారంభంలో చైనా కూడా మనలాగే జనరిక్ మందుల తయారీపైనే దృష్టి పెట్టిందని.. కానీ నేడు పాశ్చాత్య దేశాలు సైతం ఆసక్తి చూపే కొత్త ఫార్ములేషన్లను చైనా అభివృద్ధి చేస్తోందని గుర్తుచేశారు. అయితే కొన్ని మినహాయింపులు తప్ప మన ఫార్మా కంపెనీలు ఇప్పటికీ జనరిక్ మందులకే ఎందుకు పరిమితమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కంపెనీలలో పరిశోధనలు (ఆర్ అండ్ డి) లేకపోవడం.. విశ్వవిద్యాలయాలు .. పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం కొరవడటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.
కేవలం జీడీపీ వృద్ధి రేటు అంకెల గురించే చర్చించడం మానేసి.. ఆ వృద్ధి వల్ల దేశంలో తగినన్ని ఉద్యోగాలు లభిస్తున్నాయా లేదా అనే దానిపై దృష్టి సారించాలని రాజన్ సూచించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయని.. కేవలం ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పెట్టే ఖర్చుతోనే ప్రైవేట్ రంగం లోటును ఎల్లకాలం భర్తీ చేయలేమని హెచ్చరించారు. 2047 నాటికి `వికసిత్ భారత్` లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఇతర దేశాల విధానాలను గుడ్డిగా అనుకరించడం మానేసి.. భారత్ తనకంటూ ఒక స్పష్టమైన స్వతంత్ర వ్యూహాన్ని రూపొందించుకోవాలని రంగరాజన్ స్పష్టం చేశారు.
ఆర్థిక సంస్కరణల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ సూచనలను అనుసరిస్తారా లేదా? అన్నది వేచి చూడాలి. ఇటీవల విశాఖ- సీఐఐ సదస్సు 2026లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు రంగాల్లో పరిశోధనల గురించి మాట్లాడారు. ఇలాంటి సమయంలో రంగరాజన్ సూచనలను ఏపీ అనుసరించే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. పరిశోధనలు చేసే విశ్వవిద్యాలయాల విద్యార్థులకు నేరుగా పరిశ్రమల్లో ప్రాక్టికల్ గా ప్రతిదీ నేర్చుకునేందుకు ఆస్కారం కల్పించాల్సి ఉంటుంది.