అత్త కొట్టినందుకు కాదన్నట్టుగా 'కిషన్ రెడ్డి' ఆవేదన!
ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.;
ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలో ఆయన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. ఇదేసమయంలో పార్టీ తరపున బలమైన పనులు చేయడం లేదని క్లాస్ కూడా తీసుకున్నారు. ఎలా ముందుకు వెళ్లాలో ఇరు రాష్ట్రాల ఎంపీలకు.. కూడా ఆయన ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. ఈ విషయాలు బయటకు వచ్చాయి. సహజంగా కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నా బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ ఎంపీలకు మోడీ క్లాస్ ఇచ్చారన్న విషయం అన్ని వర్గాలకు తెలిసింది. ముఖ్యంగా
1) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేకపోవడం..
2) గ్రూపు రాజకీయాలకు దిగడం,
3) ఆధిపత్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం.
4) ఎవరివారే రాజకీయాలు చేయడం.
5) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోవడం.
ఈ ఐదు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రధాని వారికి దిశానిర్దేశం చేశారు. అందరూ కలివిడిగా ఉండాలని.. అధికారంలోకి వచ్చే స్థాయి నుంచి దిగజార్చవద్దని కూడా చురకలు అంటించారు.
ఈ విషయం ఎవరికి ఎలా అర్ధమైందో కానీ.. పాపం.. పార్టీ కీలక నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం తెగ ఆవేదన పడిపోయారు. పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నందుకు.. ఈ విషయం ప్రధాని వరకు వెళ్లి రాష్ట్రస్థాయి నేతల పరువు పోయినందుకు.. రాష్ట్రంలో కమల నాథుల పరిస్థితి దిగజారుతున్నందుకు.. ఆయనకు బాధ అనిపించినట్టుగా లేదు. ప్రధాని మోడీ చెప్పిన విషయాలను ఎవరు బయటకు చెప్పారు.. అన్నదే ఆయనకు తీవ్ర ఆవేదన కలిగించింది.
వెనకటికి అత్త కొట్టినందుకు కాదు.. తోడికోడలు.. నవ్వినందుకు బాధేసినట్టుగా. ప్రధాని క్లాస్ పీకినందుకు కిషన్ రెడ్డిలో ఆవేదన కనిపించలేదు. ఈ విషయం బయటకు రావడం.. మీడియాలో ప్రధానంగా చర్చకు రావడం వంటివి ఆయనకు తీరని బాధను ఆవేదనను కూడా మిగిల్చాయి. దీంతో ఈ విషయాలను బయట పెట్టిన వారిపై చర్యలు తప్పవని తాజాగా హెచ్చరించారు. మరి ఏం చేస్తారో చూడాలి. నిజానికి ఇలాంటి వి బయటకు వస్తేనే పార్టీ అలెర్ట్ అవుతుందన్న కనీస పరిజ్ఞానం కిషన్‌కు కొరవడిందని అనుకోవాలా? అంటున్నారు నెటిజన్లు.