పిన్నెల్లి వీడియో ఒరిజినలా? ఫేకా.. అంబటి వాదన ఇదే

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి వీడియో

Update: 2024-05-23 04:48 GMT

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి వీడియో. పోలింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లిన ఆయన.. ఈవీఎం ప్యాడ్ ను విసురుగా నేలకేసి కొట్టటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చి వైరల్ అయ్యింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావటం.. తీవ్రంగా పరిగణించటమేకాదు చర్యల కోసం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కోసం పోలీసులు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ అంశం మీద తన వాదనను వినిపించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తాజాగా బయటకు వచ్చిన వీడియో ఒరిజినలా? ఫేకా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో దారుణాలు జరిగాయని.. అధికారులు.. పోలీసులను అడ్డు పెట్టుకొని టీడీపీ మూకలు పెట్రేగిపోయినట్లుగా మండిపడ్డారు. బూత్ లను స్వాధీనం చేసుకున్నారని.. దొంగ ఓట్లు వేసుకున్నారని.. ఈవీఎంలను పగులగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

వైసీపీకి ఓట్లు వేస్తారని భావించిన వారిని కొట్టి ఇళ్లకు పంపినట్లుగా పేర్కొన్న అంబటి.. ‘‘ఈ ఘటనలపై పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పోలీసులకు.. అధికారులకు కంప్లైంట్ చేశారు. అయినా ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి వేళలోనే ఉన్నట్లుండి ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో పోలింగ్ బూత్ లో పిన్నెల్లి ఈవీఎంను పగలగొడుతున్నట్లుగా ఉంది.దీన్ని ఎవరు లీక్ చేశారు? ఇది ఫేకా? ఒరిజినలా తేల్చాలి? ఈ వీడియో ఎక్కడ నుంచి రిలీజ్ అయ్యిందో అర్థం కావట్లేదు. ఇలాంటిది ఏదైనా ఉంటే ఎన్నికల కమిషన్ విడుదల చేయాలి. దీన్ని లోకేశ్ ఎక్స్ లో పెట్టారంట. లోకేశ్ ట్విటర్ కు ఎలా చేరింది? ఇలాంటి వీడియోను కలెక్టర్ కానీ ఎన్నికల కమిషన్ కానీ రిలీజ్ చేయాలి. వాళ్లు ఎవరూ కాకుండా నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత కొడుకు లోకేశ్ ట్విటర్ ఖాతాలోకి ఎలా వెళ్లింది? ఎక్కడో ఏదో కుమ్మక్కు జరిగింది’’ అంటూ తన సందేహాల్ని వ్యక్తం చేశారు.

Read more!

బూత్ లను స్వాధీనం చేసుకున్న వీడియోలన్నింటిని ఎలక్షన్ కమిషన్ బయటపెట్టాలని.. తాము ఎన్నోచోట్ల కంప్లైంట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. ఆ వీడియోలన్నింటిని రిలీజ్ చేయాలన్న అంబటి.. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పిన్నెల్లి వీడియో లోకేశ్ కు ఎలా వచ్చింది? దీనిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్య తీసుకుంది? అన్న అంశాల్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. తాను బరిలో ఉన్న నియోజకవర్గంలోనూ టీడీపీ వారు పోలింగ్ బూత్ లను స్వాధీనం చేసుకొని ఓట్లు వేసుకున్నారన్నారు. వెబ్ క్యామ్ ఓపెన్ చేయమని తాను కోరితే పట్టించుకోలేదని.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పిన్నెల్లి వీడియో ఎపిసోడ్ లో ఎవరూ మాట్లాడని వేళ.. ఏపీ మంత్రి అంబటి స్పందించి మాట్లాడిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News