బారికేడ్ దూకిన పవన్... తెరపైకి ఓటుకు నోటు!

విశాఖ జగదాంబ సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.;

Update: 2023-08-12 06:00 GMT

విశాఖ జగదాంబ సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సభలో వైసీపీ నేతలపైనా, సీఎం జగన్ పైనా పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో రుషికొండ పర్యటనలో పవన్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన అనంతరం ఆంక్షల నడుమ పవన్‌ కల్యాణ్‌ రుషికొండ వద్దకు వెళ్లి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. ఈ కొండ వద్దకు వెళ్లకూడదని బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. దూరం నుంచే చూడాలని స్పష్టం చేశారు. దీంతో బారికేడ్ దూకి మరీ రుషికొండ ప్రాంతాన్ని జనసేన అధినేత పరిశీలించారు.

ఇలా క్రమంలో కొద్దిసేపు అక్కడనుంచే పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌... ఆ తరువాత అక్కడే ఉన్న మీడియా వాహనంపైకెక్కి నిర్మాణాలను చూశారు. కొండ తవ్వకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. నిబంధనలు పాటించాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు.

వైకాపా నాయకుడు తెలంగాణలోనూ ఇలానే దోపిడీ చేశారు. అందుకే అక్కడి నుంచి తన్ని తరిమేశారు. ఇప్పుడు ఆయన కన్ను ఉత్తరాంధ్రపై పడింది అంటూ పవన్‌ అస్పష్టంగా ధ్వజమెత్తారు! దీంతో 10ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఏపీకి వచ్చింది చంద్రబాబు కదా.. ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన్నే కేసీఆర్ తరిమేశారా అంటూ ఆన్ లైన్ వేదికగా చర్చ మొదలైంది.

అనంతరం రుషికొండ తవ్వకాలకు, నిర్మాణాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతి ఉందా? లేదా? అని పవన్ ప్రశ్నించారు. ఈ సమయంలో ఆయన వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.

కాగా... పవన్‌ కల్యాణ్‌ రుషికొండ పరిశీలనకు వెళ్లే సమయంలో పోలీసులు భద్రతా కారణాలరీత్యా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జోడుగుళ్లపాలెం నుంచి రుషికొండ వరకు అయిదు అంచెల భద్రతను పోలీసులు ఏర్పాటుచేశారు.

Tags:    

Similar News