రుషికొండపై పవన్.. అప్పటికి.. ఇప్పటికి ఎంత తేడా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండపై నిర్మించిన భవనాలపై పెద్ద చర్చే జరిగింది.;

Update: 2025-08-29 08:11 GMT

‘సేనతో సేనాని’ కార్యక్రమం కోసం నిన్నటి నుంచి విశాఖలోనే ఉన్న జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు రుషికొండపై నిర్మించిన పర్యాటక భవనాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం అత్యంత రహస్యంగా రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భవనం పెద్ద వివాదాస్పద కట్టడంగా మారిన విషయం తెలిసిందే. వైసీపీ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రమోట్ చేశారు. అంతేకాకుండా విశాఖ నగరం నుంచి పరిపాలన సాగిస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయం కోసం రుషికొండపై హరిత రిసార్ట్స్ కూల్చివేసి ఆ స్థలంలో నాలుగు అత్యాధునిక భవనాలను నిర్మించారు. అయితే ఈ భవనాల్లో అడుగు పెట్టకుండానే ఆయన పదవీత్యుడు కావడంతో రుషికొండ భవనాలు ఖాళీగా ఉండిపోయాయి.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండపై నిర్మించిన భవనాలపై పెద్ద చర్చే జరిగింది. ఇప్పటికీ ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన తొలి శాసనసభ సమావేశాల్లో ఈ భవనాల వినియోగంపై స్వల్ప చర్చ జరిగింది. అప్పట్లో భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలను ప్రజలకు చూపించారు. మీడియాను తీసుకువెళ్లి రుషికొండ ప్యాలెస్ ఎంత ఆడంబరంగా నిర్మించారో బట్టబయలు చేశారు. ఆ తర్వాత దీనిపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రుషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలో సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. ఇక 15 నెలల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా రుషికొండపై అడుగు పెట్టారు.


అప్పుడు రూ.7 కోట్ల లాభం.. ఇప్పుడు రూ.కోటి నష్టం

గత ప్రభుత్వంలో పవన్ ప్రతిపక్షంలో ఉండగా, రుషికొండపై ఉన్న ఈ వివాదాస్పద కట్టడాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో బీచ్ రోడ్డులోనే పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. కట్ చేస్తే రెండేళ్ల తర్వాత అధికారిక హోదాలో పవన్ రుషికొండకు వచ్చారు. కొండపై నిర్మించిన నాలుగు భవనాలను నిశితంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం.. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను కూలగొట్టి.. ఇప్పుడు ఏడాదికి రూ.కోటి ఖర్చు అయ్యే భవనాలను నిర్మించారని పవన్ విమర్శించారు. ఈ నాలుగు భవనాలను ఏం చేయాలో తోచడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు పవన్.


పెచ్చులూడిన సీలింగ్

ఇక గతంలో పవన్ ను రోడ్డుపైనే నిలిపేసిన అధికారులు ఇప్పుడు ఘనంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో పర్యాటక శాఖ జనసేన వద్దే ఉండటంతో సంబంధిత మంత్రి కందుల దుర్గేశ్ ను వెంట బెట్టుకుని రుషికొండకు వచ్చిన పవన్... భవన నిర్మాణంపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఇక సమావేశ మందిరంలో సీలింగ్ పెచ్చులూడిపోవడాన్ని పవన్ గుర్తించారు. ప్రారంభానికి ముందే ఇలా పెచ్చులూడిపోవడం, వర్షం నీరు లీకవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు పవన్. దీనిపై అధికారులను ప్రశ్నించగా, తాము కూడా ఇప్పుడే చూస్తున్నామని వివరణ ఇచ్చారు.


అసెంబ్లీలో ప్రత్యేక చర్చ

రుషికొండ భవనాలను పరిశీలించిన పవన్ ఈ భవనాల నిర్మాణం, వినియోగంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. భవనాల సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం గతంలో తనను రుషికొండకు రానీవ్వకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏడు భవనాలను కూల్చి కేవలం నాలుగు మాత్రమే నిర్మించారని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గతంలో ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే భవనాలను కూల్చేయడాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు నెలకు రూ.15 లక్షలు కరెంటు బిల్లుకే వెచ్చించాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని, ఈ భవనాలను ఏం చేయాలనే విషయమై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. అదేవిధంగా జనసేన తరపున కొన్ని ప్రతిపాదనలు చేస్తామన్నారు. గత ముఖ్యమంత్రి తన నివాస భవనాల కోసం రుషికొండ ప్యాలెస్ నిర్మించారని, కానీ తాము ఈ భవనాలను పర్యాటక అవసరాలకు వినియోగించేందుకు ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు పవన్.


Tags:    

Similar News