గ్రామాలకు టెక్ సొల్యూషన్.. పవన్ కొత్త స్ట్రాటజీ
ఇదిలా ఉంటే, ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు పవన్ చేపట్టిన కార్యక్రమం ఎంతగానో అక్కరకొస్తుందని విశ్లేషిస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏం చేసినా అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన చేపడుతున్న చాలా పనులకు మంచి స్పందన వస్తోంది. తేదేపా-భాజపాతో జత కట్టిన జనసేన వేగంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం అవ్వడానికి ఇది సహకరిస్తోందని విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు పవన్ చేపట్టిన కార్యక్రమం ఎంతగానో అక్కరకొస్తుందని విశ్లేషిస్తున్నారు. పవన్ తన అభిరుచి మేరకు గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ చేసారు. ఇప్పుడు 'మన ఊరు మాట - మంచి మాట' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని గురువారం నాడు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పవన్ ఎంపిక చేసుకున్న విధానం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఉపముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ సమస్యల్ని తెలుసుకోవాలంటే చాలా సమయం కావాలి. వ్యయప్రయాసలకు ఓర్చాలి. అయితే తాను తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో ఉంటూనే ఒక పెద్ద తెర మీద ప్రజా సమస్యలను వినేందుకు, గ్రామాల స్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అవసరమైన సాంకేతికతను ఎడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు నేరుగా ఉపముఖ్యమంత్రితో మాట్లాడి తమ సమస్యకు పరిష్కారం కోరవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ అనే సాంకేతికతను పవన్ చాలా తెలివిగా సద్వినియోగం చేసుకోబోతున్నారు.
ప్రారంభం టెక్కలిలోని భవానీ థియేటర్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని రావివలస గ్రామ నివాసితులతో ఆయన మాట్లాడతారు. దాదాపు 300 మంది గ్రామస్తులతో మంతనాలు సాగుతాయి. పవన్ నేరుగా ప్రజా సమస్యలను విని, ప్రభుత్వ అధికారులను వెంటనే వాటిపై చర్య తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఈ విధానాన్ని పరిచయం చేయడం అనేది పవన్ చతురత. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నదే అయినా కానీ దానిని సమర్థంగా నిర్వహించేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. భవిష్యత్ లో ఇది అన్ని గ్రామాల ప్రజా సమస్యలకు పరిష్కారం సూచించేందుకు ఉత్తమ మార్గం కాగలదని భావిస్తున్నారు.