బాబుతోనూ విభేదిస్తా - పవన్ సంచలన వ్యాఖ్యలు
కూటమి నిర్ణయాల విషయంలో తాను అన్ని విషయాల్లోనూ అంగీకరిస్తున్నాను అన్నది వాస్తవం కాదన్నట్లుగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు.
కూటమి నిర్ణయాల విషయంలో తాను అన్ని విషయాల్లోనూ అంగీకరిస్తున్నాను అన్నది వాస్తవం కాదన్నట్లుగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తనకు కొన్ని అంశాలలో విభేదాలు ఉన్నాయని అన్నారు. అయితే కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. కూటమి పార్టీలలోని నేతలు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
అది మంచి అవకాశమే :
ఇదిలా ఉంటే 2024 ఎన్నికలు జనసేనకు మంచి అవకాశంగానే పవన్ చెప్పారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టు అయి జైలులో ఉన్నారని జనసేనకు ఒంటరిగా పోటీ చేసే బలం కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనది అని అన్నారు. అది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేది అని అన్నారు. ఆనాడు కనుక తాను పొత్తులకు వెళ్ళకపోతే మరోసారి వైసీపీ గెలిచేదని రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యేదని పవన్ చెప్పారు. అప్పటికే ఐసీయూలో రాష్ట్రం ఉందని ఆయన గుర్తు చేశారు. అందుకే అయిదు కోట్ల ఆంధ్రుల తరఫున తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తాను ఎక్కడైనా రాజీ పడ్డాను అంటే అది రాష్ట్రం కోసమే తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.
త్రికరణ శుద్ధితో మద్దతిస్తా :
తాను ఎవరికైనా మద్దతు ఇస్తే త్రికరణ శుద్ధితో వ్యవహరిస్తాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో వారి నుంచి కూడా అలాంటి చిత్త శుద్ధినే ఆశిస్తాను అన్నారు. ఇపుడు చూస్తే చాలా చోట్ల జనసేన కార్యకర్తలకు సమస్యలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. అనేక నియోజకవర్గాలలో ఇబ్బందులు పడుతున్నారని తనకు తెలుసు అన్నారు. అందుకే కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బ తినకుండా తాను చూస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలు పడే ఇబ్బందులకు తగిన పరిష్కారాన్ని చూపిస్తామని అదే సమయంలో సరిదిద్ద గలిగినంత మేరకు సరిదిద్దుతామని ఆయన తెలిపారు.
అందరి వాడిని :
తనకు కులం ప్రాంతం అని ఒకే చోటకు ఒకే గూటికి అంటగట్టవద్దు అని పవన్ కోరారు. తాను కాపు కులంలో పుట్టడం అన్నది తన చేతులలో లేదని అన్నారు. తాను అందరి వాడిని అని అన్నారు. అందరి కోసం తాను పనిచేస్తాను అని పవన్ చెప్పారు. తనకు అందరూ కావాలని అన్నారు. ఇక ఈ రోజు వంగవీటి రంగా మీద ప్రేమ చూపిస్తున్న వారు ఆనాడు ఆయన తనకు ప్రాణ హాని ఉందని అన్నపుడు రక్షణ ఎందుకు కల్పించలేకపోయారో చెప్పాలని పవన్ ప్రశ్నించారు.
ఓట్లు వేయలేదు కాబట్టి :
ఇక తనకు భీమవరం గాజువాకలలో పోటీ చేసినపుడు రెండు చోట్లా ఓట్లు వేసి గెలిపించి ఉంటే మరోలా ఉండేదని అన్నారు. కానీ అలా జరగలేదు కదా అని ఆయన పార్టీ సమావేశంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక మీదట తాను పార్టీ సమావేశాల్లోనే ఎక్కువగా ఉంటాను అని అన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఇక మీదట పార్టీ ఆఫీసులో కూర్చుని అన్ని విషయాలు చర్చిస్తామని అన్నారు. అందరికీ న్యాయం చేస్తామని కూడా పవన్ భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయని పవన్ చెప్పడం విశేషం.