మగాడా...బాగా ఏడవవయ్యా !

మగాడు. పుట్టినపుడే అంతా అనే ఒకే మాట. వాడికేమిటి రా మగాడు. ఎంతటి బాధను అయినా భరించేస్తాడు అని.

Update: 2026-07-01 03:30 GMT

మగాడు. పుట్టినపుడే అంతా అనే ఒకే మాట. వాడికేమిటి రా మగాడు. ఎంతటి బాధను అయినా భరించేస్తాడు అని. ఇది కితాబు అనుకుని ముఖం మతాబుల వెలిగించేసుకుని ఆనాడే నిర్ణయించేసుకుంటాడు తాను ఎంత బాధను అయినా తట్టుకోగలను అని. తన కంట కన్నీరు ఒలికించరాదు అని. తన బాధలు అన్నీ తన మనసు గోడల నుంచి బయటకు ఏ మాత్రం జారవిడిచ రానీయను అని. ఇలా మగాడు తానొక ప్రత్యేక కేటగిరీగా ఫీల్ అవడం మొదలెడతాడు. నిజానికి అక్కడే మగాడు పప్పులో తప్పులో కాలేస్తున్నాడు అని మానసిక నిపుణులు అంటున్నారు.

బాధకు ఆడా మగా ఏంటి :

అవును కదా. ఇది నిజమే కదా. బాధ వస్తే దానికి లింగ బేధం ఉంటుందా. అసలు ఆడ మగ అని చూసి ఎమోషన్స్ వాటి రేంజిని తగ్గిస్తాయా లేక పెంచుతాయా. అసలు కాదుగా. మరి ఈ లాజిక్ ని మగాడు ఎక్కడో ఎపుడో యుగాల నాడే మిస్ అయ్యాడు. తన బాధలను అదిమి పెట్టుకోవాలని ఒక విచిత్రమైన ఆలోచనతో బతికేస్తూ పోతున్నాడు. తాను గొప్ప అని కూడా తప్పుడు భావనతో ఉన్నాడు. వాస్తవంగా చూస్తే మగాడు తన భావాలను బాధలను దాచుకోవడం ద్వారా ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాడని మానసిక నిపుణులు తేల్చారు.

అది చివరికి ముదిరి :

గుండె గుప్పెడు అంత ఉంటుంది. అందులో చెప్పలేని వేల కోటి బాధలను దాస్తే ఏమవుతుంది. అది బద్దలు అవుతుంది. అందుకే మగవారికి అనేక రకాలైన మానసిక శారీరక సమస్యలు అని నిపుణులు అంటున్నారు. బాధను దాచుకోవడం, తన అభిప్రాయాలను ఎక్కడా ఎపుడూ వ్యక్తం చేయకపోవడం వల్ల మగాళ్ళలో పెద్ద ఎత్తున మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయని అంటున్నారు. అంతే కాదు అది కాస్తా చివరికి డిప్రెషన్ కి దారి తీస్తోందని ఈ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.

అరుపులు కేకలు సంకేతాలు :

అయితే మగవాడు తన ఒత్తిడిని ఎంత అదిమిపెట్టినా అది ఏదో రూపంలో ఎగదోస్తోంది అని చెబుతున్నారు. కోపం అరుపులు కేకలు ఇవన్నీ డిప్రెషన్ కి సంకేతాలు అని అంటున్నారు. తాజాగా వస్తున్న అనేక అధ్యయనాలు చూస్తే కనుక మగవారిలో డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తేల్చాయి. సమస్యలను ఒంటరిగా ఎదుర్కోలేక ఎవరితో పంచుకోలేక సతమతమవుతూ తమ మానసిక వ్యాధులను ముదరబెట్టుకుంటూ ఆఖరికి అన్ని విధాలుగా చెడిన తరువాత వైద్యులను సంప్రదిస్తున్నారు. దాంతో అక్కడ చికిత్సకు కూడా అందని వైనం కనిపిస్తోంది అని అంటున్నారు.

వ్యసనపరులుగా మారి :

మనసు నిండా బాధలు భావోద్వేగాలతో నింపేసుకున్న మీదట అది పెట్టే ఒత్తిళ్ళకు తట్టుకోలేక వ్యసనపరులు అవుతున్న వారు కూడా అధికంగా కనిపిస్తున్నారు. వారు మద్యానికి బానిసలుగా మారి ఇల్లు ఒళ్ళూ గుల్ల చేసుకుంటున్నారు. ఎందుకిలా తయారయ్యావ్ అంటే చెప్పలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇక తరచూ తలనొప్పితో పాటు అలసట చికాకు విసుగు ఇవన్నీ బోనస్ గా వచ్చే సమస్యలుగా కూడా మానసిక నిపుణులు చెబుతున్నారు.

మారాలి పూర్తిగా :

మగవారు అయినంత మాత్రాన అన్నీ భరించే సత్తా ఆ చిన్ని గుండెకు ఉండదు, ఆ మెదడులో ఎన్నో ఆలోచనలు నింపి భారంగా మార్చలేరు. కాబట్టి తమ ఇబ్బందులు సమస్యలను దగ్గర వారితో పంచుకుంటే పరిష్కారం కాదు కానీ గుండె బరువు దిగుతుంది, మెదడు మొద్దుబారడం ఆగుతుంది. డిప్రెషన్ నుంచి ఎంతో కొంత నెమ్మదిగా బయటపడతారు అని నిపుణులు సూచిస్తున్నారు. ఎదుటి వారితో తమ భావాలను పంచుకుంటే తాము పిరికివారమనో లేక బలహీనులమనో భావించడం తప్పు అని అంటున్నారు. అందరూ మనుషులే అందరికీ ఒకేలా సమస్యలు స్పందనలు ఉంటాయి కాబట్టి ఒక మగాడా అలా రాయిలా ఉండిపోకు, బాధ కలిగితే పంచుకో, లేకపోతే దగ్గర వారితో మాట్లాడు, గుండె నిండా ఏడువు. అపుడే రోగాలకు దూరంగా ఉంటావని సలహా ఇస్తున్నారు. మరి మేము మగ మహరాజులమని గొప్పలు పోకుండా మనుషులుగా వ్యవహరించాల్సిన సమయం అయితే మగవారికి ఆసన్నం అయింది. నవ్వు వచ్చినా ఏడుపొచ్చినా దాచుకోకుండా ఓపెన్ అయితేనే జీవితం బాగుంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News