ఇన్‌ఫ్లుయెన్సర్లకు డ్యూటీ అప్పటి నుంచేనా.. ?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా రాష్ట్ర సర్కారు ప్రకటించి చాలా రోజులే అయింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా రాష్ట్ర సర్కారు ప్రకటించి చాలా రోజులే అయింది. వీరిని నియమించుకునేందుకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎంతెంత పారితో షికం ఇవ్వాలి.. ఎంత వరకు వారి సేవలు వినియోగించుకోవాలి.. అనే కీలక అంశాలపైనా కమిటీని నియమించారు. మొత్తంగా అన్నీ రెడీ అయ్యాయి. ప్రభుత్వం కూడా జీవో ఇచ్చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కూడా కోరింది. కానీ.. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా.. ఎవరూ న్యాయపరమైన వివాదాలు కూడా చేయలేదు.
దీంతో తాము తీసుకురానున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇబ్బందులు లేవని, రావని ప్రభుత్వం భావించింది. అయితే.. ఇక్కడే అసలు స్టోరీ తెరమీదికి వచ్చింది. క్షేత్రస్తాయిలో ఇన్‌ఫ్లుయెన్సర్ల పరిస్థితి కంటే కూడా.. చిన్న తరహా మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. డైలీ, వీక్లీలు నడిపే చిన్న పత్రికల యాజమాన్యాలు.. దీనిపై ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని, పథకాలను ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికల యాజమాన్యాలు.. మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించాయి.
తమ ఉపాధి దెబ్బతింటుందని.. పైగా ఇన్ ఫ్లుయెన్సర్లకంటే కూడా తాము ఇచ్చే ప్రచారమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తోందని కూడా వారు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్రను తగ్గించాలని కోరారట. కానీ.. అప్పటికే ఈ విషయంపై విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సర్కారు ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇదిలావుంటే.. స్థానిక ఎన్నికలకు ముందుగానే ఇన్‌ఫ్లుయెన్సర్లను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఎన్నికల వేళ వారిని వినియోగిస్తే.. న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించి వాయిదా వేశారు.
ఇక, ఎన్నికలు ముగిసిన తర్వాత కానీ.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు బాధ్యతలు అప్పగించే అవకాశం లేదని అంటున్నారు. అంటే దాదాపు డిసెంబరు వరకు వేచి చూడాలి. అప్పటి వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక.. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వీరిని రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. ఈలోగా వారికి ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించి ముందుకు సాగాలని నిర్ణయించారు. మొత్తంగా..కీలక సమయంలో ఇన్‌ఫ్లుయెన్సర్లను వినియోగించుకోలేక పోవడం కేవలం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం చేయడం గమనార్హం.