కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రుల గ్రాఫ్ లెక్క‌లివే... !

కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరు (గ్రాఫ్‌), ర్యాంకింగులను అంచనా వేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలిసింది.

Update: 2026-11-01 02:30 GMT

కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరు (గ్రాఫ్‌), ర్యాంకింగులను అంచనా వేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం ఆధారంగానే గ్రాఫ్ ఉంటుంద‌ని గ‌త కేబినెట్‌లో చెప్పారు. కానీ, ఇప్పుడు దానిని వ‌దిలేసి.. మ‌రో మూడు కీలక కొలమానాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మంత్రుల‌కు సంబంధించి ఆయ‌న పూర్తిస్థాయిలో నివేదిక‌లు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖలపై పట్టు, ప్రభుత్వ పథకాల అమలు వేగం, ప్రజల్లో వారికున్న ఆదరణను బట్టి ఈ గ్రాఫ్‌ను నిర్ధారించ‌నున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

1) ఫైళ్ల క్లియరెన్స్ వేగం: గ‌తంలోనూ దీనిని సీఎం ఒక కొల‌మానంగా తీసుకున్నారు. నిర్ణయాల వేగంలో మంత్రుల ప‌నితీరును అంచ‌నా వేశారు. సచివాలయంలో మంత్రుల వద్దకు వచ్చే వివిధ శాఖల ఫైళ్లను ఎంత వేగంగా పరిశీలించి ఆమోదం తెలుపుతున్నారనేది అత్యంత కీలకమైన కొలమానంగా ఆయ‌న చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ఒక ఫైల్ క్లియర్ చేయడానికి మంత్రి సగటున ఎన్ని గంటలు లేదా రోజుల సమయం తీసుకుంటున్నారనే దానిపై నిరంతరం డేటా సేకరిస్తున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకునే మంత్రుల గ్రాఫ్ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

2) శాఖలపై పట్టు, నిధుల వినియోగం: తమకు కేటాయించిన శాఖలపై మంత్రులకు ఎంతవరకు అవగాహన, పట్టు ఉందనేది రెండో కొలమానంగా భావిస్తున్నారు. వివిధ ప‌థ‌కాల రూపంలో కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టడం, బడ్జెట్ నిధుల సద్వినియోగం, శాఖా పరమైన ప్రగతి, మరియు అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యాలను ఎంతవరకు రీచ్ అవుతున్నారనే అంశాలను ఇందులో లెక్కిస్తారు. త‌ద్వారా మంత్రుల ప‌నితీరును అంచ‌నా వేయ‌నున్నారు.

3) ప్రజల్లో ఆదరణ: ప్రజా క్షేత్రంలో ఉనికిని చాటుకునే మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారనే విష‌యాన్ని ఈ సారి మ‌రింత ఖ‌చ్చితంగా చూడ‌నున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవ, ప్రభుత్వ ఇమేజ్ పెంచేలా వారి ప్రవర్తన ఉందా లేదా అనే అంశాలపై క్షేత్రస్థాయి నివేదికలు (ఐబీ మరియు ఇంటెలిజెన్స్ సర్వేలు) ఆధారంగా మంత్రుల గ్రాఫ్‌ను నిర్ణ‌యించ‌నున్నారు. వాస్త‌వానికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుని ముందుకు సాగాల‌ని అనుకున్నా.. తుఫాను ప్ర‌భావంతో ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుని.. కేవ‌లం ప‌నితీరును పై మూడు అంశాల ఆధారంగానే నిర్ణ‌యించ‌నున్న‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News