వీర్రాజు ఊసు మరిచిపోయారే.. ఏం జరిగింది.. ?
స్థానిక ఎన్నికలైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా.. తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకునే సోము వీర్రాజు.. తాజాగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
స్థానిక ఎన్నికలైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా.. తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకునే సోము వీర్రాజు.. తాజాగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన గురించి ఎక్కడా ఒక్కవార్తకానీ.. ఆయన అనుచరులు అంటూ ఎవరైనా రంగంలోకి దిగడం కానీ.. జరగలేదు. దీంతో అసలు ఏం జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం సోము వీర్రాజు.. ఎమ్మెల్సీగా ఉన్నారు. పైగా ఆయనకు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో మంచి పట్టు కూడాఉందన్న చర్చ ఉంది.
అయితే.. తాజా ఎన్నికల వేళ సోము వారు సైలెంట్ కావడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే విషయం పై ఒకరిద్దరు నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సోము సైలెంట్ అయ్యారని చెబుతున్నా రు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కొన్ని చోట్ల ఇవి ఏకగ్రీవం అయినా.. మెజారిటీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. అయినప్పటికీ సోము గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు.
అలిగారా.. ?
పార్టీ సీనియర్ నేత కావడం, గతంలోనూ పార్టీ అధ్యక్షుడిగా చక్రం తిప్పడం వంటివి సోముకు ఉన్న ప్రత్యేక లక్షణా లు. దీంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకునే విషయంలో ముందుంటున్నారు. అయితే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పీవీఎన్ మాధవ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయినప్పటికీ.. తొలినాళ్లలో సోము బాగానే రాజకీయాల్లో పుంజుకునే ప్రయత్నాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు కూడా. అయితే.. ఆయన అప్పట్లో వ్యవహరించిన తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.
రాజధాని విషయంలో సోము చేసిన వ్యాఖ్యలు పార్టీకి కొంత ఇబ్బందిగా మారాయి. దీంతో ఆయనను పక్కన పెట్టారు . అయినప్పటికీ.. కూటమిలో బీజేపీ తరఫున తన వాయిస్ వినిపించేందుకు సోము ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల సమావేశాలకు ప్రతినిదిగా తనను పంపించాలని కూడా కోరుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే.. అంతర్గతంగా జరిగిన చర్చలతోపాటు.. సోముకు ఉన్న ఏకపక్ష ఇమేజ్ కారణంగా.. కూటమి సమావేశాలకు ఆయనను దూరం పెట్టారు. దీంతో ఆయన అలిగారని.. అందుకే కీలకమైన ఎన్నికల సమయంలోనూ ఆయన మౌనంగా ఉన్నారని అంటున్నారు. అయితే.. సోము వచ్చినా.. రాకపోయినా.. ఆయన వల్ల పెద్దగా ఒరిగేది లేదని పార్టీలోని మెజారిటీ నాయకులే అభిప్రాయపడుతుండడం గమనార్హం.