కూటమికి కటీఫ్.. దళపతి షాకింగ్ డెసిషన్, స్టాలిన్ వార్నింగ్ తో దూకుడు!
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కేవలం రెండు నెలలు అవుతున్నా, అక్కడ రాజకీయాల్లో మాత్రం వేడి చల్లారడం లేదు.
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కేవలం రెండు నెలలు అవుతున్నా, అక్కడ రాజకీయాల్లో మాత్రం వేడి చల్లారడం లేదు. ప్రధానంగా పూర్తి మెజార్టీకి కూతవేటు దూరంలో నిలిచి, 8 మంది సభ్యులు ఉన్న నాలుగు పార్టీలపై ఆధారపడటంతో ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తన పనితీరుపై మిత్రపక్షాలు బహిరంగంగా విమర్శలు చేస్తుండటం జీర్ణించుకోలేకపోతున్న సీఎం వీలైనంత త్వరగా సొంత మెజార్టీ సాధించాలనే వ్యూహం రచిస్తున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆరు నెలల్లో ఎన్నికలకు సిద్ధమవ్వాలని, టీవీకే ప్రభుత్వం పడిపోతుందని మాజీ సీఎం స్టాలిన్ చేస్తున్న హెచ్చరికలతో సీఎం మరింత అప్రమత్తం అయ్యారని అంటున్నారు.
234 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. అయితే ముఖ్యమంత్రి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం తప్పనిసరిగా వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి పార్టీలపై ఆధారపడాల్సివచ్చింది. ఈ నాలుగు పార్టీలకు ఇద్దరేసి చొప్పున మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా మాజీ సీఎం స్టాలిన్ పట్ల సానుకూలంగా ఉండటమే కాకుండా, ముఖ్యమంత్రి విజయ్ విధానాలను బహిరంగంగా విమర్శిస్తూ పక్కలో బళ్లెంలో తయారయ్యారని అంటున్నారు. దీంతో మిత్రపక్షాలను వదిలించుకునేలా ముఖ్యమంత్రి విజయ్ వ్యూహం రచించారని అంటున్నారు.
ఇందులో భాగంగానే ప్రతిపక్షంలోని ఏఐడీఎంకే ఎమ్మెల్యేలను టీవీకేలో చేర్చుకునేలా ముఖ్యమంత్రి విజయ్ ప్లాన్ చేశారని అంటున్నారు. దీనికి నిదర్శనంగా ఆ పార్టీకి చెందిన కరూర్ ఎమ్మెల్యే విజయభాస్కర్ తాజాగా పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ రాశారు. ఆ వెంటనే స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. దీంతో అన్నాడీఎంకే నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఆరు స్థానాలతోపాటు తాను రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో టీవీకేను గెలిపించుకుని మిత్రపక్షాల నుంచి ముప్పు లేకుండా జాగ్రత్త పడాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న 107 మంది ఎమ్మెల్యేలతోపాటు అదనంగా ఏడు స్థానాలు గెలిస్తే టీవీకే బలం 114 అవుతుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిపి 119 స్థానాలతో ప్రభుత్వం సురక్షితంగా ఉంటుందని ముఖ్యమంత్రి విజయ్ భావిస్తున్నారని చెబుతున్నారు.
ఈ పరిణామాలతో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పార్టీలు సైతం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు డీఎంకే-అన్నాడీఎంకే ఒక్కటై ముఖ్యమంత్రి విజయ్ వ్యూహాలకు చెక్ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆ రెండు పార్టీలు రాజకీయంగా అవగాహన కుదుర్చుకునే పరిస్థితి ఏర్పడితే అది తనకు మరింత మంచి చేస్తుందని ముఖ్యమంత్రి విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ విధంగా ఏం జరిగినా, తన ప్రభుత్వానికి ఢోకా ఉండదనే ధీమా సీఎంలో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి, దళపతి విజయ్ మిత్రపక్షాలను వదిలించుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది.