హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. బెంగళూరుకు షిఫ్ట్ అవ్వడానికి వెనుక ఉన్న ‘మహా’ లక్ష్యాలివే
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెరీర్ పరంగా మరో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెరీర్ పరంగా మరో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియాలో మోస్ట్ డిమాండింగ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన పాండ్యా.. ఇకపై కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని తన శాశ్వత ట్రైనింగ్ బేస్‌గా మార్చుకోవాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఒక విలాసవంతమైన ప్రాంతంలో భారీ మొత్తానికి ఒక ప్రాపర్టీని కూడా అతడు అద్దెకు తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
బెంగళూరుకే ఎందుకు?
గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వెన్నునొప్పి, ఇతర ఫిట్‌నెస్ సమస్యల వల్ల అతడు కీలక టోర్నీలకు దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ను మరింత కాలం విజయవంతంగా కొనసాగించాలంటే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఒక్కటే మార్గమని హార్దిక్ భావిస్తున్నాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) లో ప్రపంచ స్థాయి అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఉంటూనే తన శిక్షణ, ఫిట్‌నెస్, రీహాబిలిటేషన్ కార్యక్రమాలన్నింటినీ నిరంతరం పర్యవేక్షించుకోవాలని పాండ్యా నిర్ణయించుకున్నాడు. ఈ సెంటర్‌కు వీలైనంత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే అతడు ముంబై వదిలి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత సిబ్బందితో ప్రత్యేక శిక్షణ
ఈ ఫిట్‌నెస్ మిషన్ కోసం హార్దిక్ పాండ్యా ఇప్పటికే ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. బోర్డు సదుపాయాలతో పాటు తన వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రత్యేక ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకున్నాడు. ప్రత్యేక స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్దరి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిరోజూ కఠినమైన శిక్షణ పొందేందుకు హార్దిక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. కాగా ఈ ప్రయాణంలో అతడితో పాటు మిహికా కూడా బెంగళూరులోనే నివసించనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ భవితవ్యంపై సస్పెన్స్!
ఇటీవలి కాలంలో హార్దిక్ పాండ్యా పేరు కేవలం ఆట పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగానూ సోషల్ మీడియాలో బాగా వినబడుతోంది. వైవాహిక జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు, ఐపీఎల్-2024 సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం అతడిని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అతడు ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహిస్తాడా? లేదా మెగా వేలానికి ముందే వేరే ఫ్రాంచైజీకి మారుతాడా? అనే సస్పెన్స్ క్రికెట్ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
హార్దిక్ ముందున్న ‘మహా’ లక్ష్యాలివే..
విమర్శలు, ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ.. హార్దిక్ మాత్రం తన భవిష్యత్తు లక్ష్యాలపై క్లారిటీతో ఉన్నాడు. వచ్చే ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు వైట్ బాల్ వన్డే, టీ20 క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగడమే అతడి టార్గెట్. 2027 వన్డే ప్రపంచకప్ ను భారత్‌కు ఎలాగైనా టైటిల్ అందించడం... క్రికెట్ చేరిన తొలి 2028 ఒలింపిక్స్‌లోనే భారత జట్టుకు పతకం సాధించి పెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఈ రెండు ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించాలంటే వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉండటం అనివార్యం. అందుకే బెంగళూరును తన శాశ్వత శిక్షణా కేంద్రంగా మార్చుకుని సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. హార్దిక్ గనుక గాయాల బారి నుంచి తప్పించుకుని తన పాత లయను అందుకుంటే.. రాబోయే ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు అతడే అతిపెద్ద నెక్ట్స్ లెవెల్ వెపన్ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.