ఏపీ ఖజానాను నింపేందుకు సరికొత్త సంపద
ఏపీ ఖజానా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. వస్తున్న ఆదాయానికి పెడుతున్న ఖర్చుకు ఎక్కడా పొంతన అన్నది అయితే లేదు. మ
ఏపీ ఖజానా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. వస్తున్న ఆదాయానికి పెడుతున్న ఖర్చుకు ఎక్కడా పొంతన అన్నది అయితే లేదు. మరో వైపు చూస్తే సంక్షేమ పధకాలకు బడ్జెట్ ఎక్కువ అవుతోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూడా నిధులు కావాల్సి వస్తోంది. అలా అభివృద్ధిని సంక్షేమాన్ని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగడం అంటే ఎంతటి అనుభవశాలికి అయినా కష్టసాధ్యమే అని అంటున్నారు. అందుకే ఆదాయ మార్గాలను అన్వేషించేందుకు ప్రభుత్వం రకరకాలైన మార్గాలను వెతుకుతోంది.
ఖనిజమే ఆదాయంగా :
ఈ నేపధ్యంలో ఏపీలో విస్తారంగా ఉన్న ఖనిజ సంపద ఆదాయంగా మారుతుందని అంటున్నారు. ఈ విషయంలో గట్టిగా ఫోకస్ చేస్తే కనుక ఏపీ ఆదాయం పెరగడమే కాదు అనుకున్న విధంగా సంపద సృష్టి జరిగి భారీ ఊరటని ఇస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నారు. తాజాగా మైనింగ్ విషయంలో ఆయన అధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వారికి విలువైన సూచనలు చేయడం గమనార్హ్యం. ఇదే సందర్భంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు.
గరిష్టంగా ఆదాయం :
ఇక రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని చంద్రబాబు అధికారులను అలెర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఆస్కారం ఉందని చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేయడం విశేషం. అంతే కాదు రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని మిగతా బ్లాక్స్ పై కూడా అధ్యయనం చేయాలని చంద్రబాబు ఏకంగా గనుల శాఖకు సూచనలు ఇచ్చారు.
పడితే బంగారమే :
ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా జొన్నగిరి వద్ద బంగారు నిల్వలు లభ్యం అయ్యాయి. అవి చిత్తూరులో కూడా ఉంటాయని అంటున్నారు. అలా తవ్వకాలు జరిపితే పట్టిందల్లా బంగారమే అని అంటున్నారు. ఇక బంగారంతో సరిసమానమిన అరుదైన ఖనిజాలు ఎన్నో ఏపీలో ఉన్నాయని మైనింగ్ విభాగం నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం వాటి మీద కనుక దృష్టి సారిస్తే ఆదాయ మార్గాలు సింహద్వారం తెరచుకున్నట్లే అని అంటున్నారు. మరి గనులతో ఖనిజాలతో ఏపీ దశ దిశ మారుతుందని ఆశించవచ్చా అంటే జవాబు అవును అనే వస్తోంది.