పూరీలు వేసిన టీడీపీ ఎమ్మెల్యే.. ప్లేట్ 2 వేలు!

ఏపీలో ఓ ఎమ్మెల్యే వేసిన పూరీలు ప్లేట్ 2 వేల రూపాయ‌లు ప‌లికాయి. ఓ అభిమాని.. ప్లేట్ పూరీల‌ను(2) 2 వేల రూపాయల‌కు ద‌క్కించుకున్నారు.

Update: 2026-06-30 18:45 GMT

ఏపీలో ఓ ఎమ్మెల్యే వేసిన పూరీలు ప్లేట్ 2 వేల రూపాయ‌లు ప‌లికాయి. ఓ అభిమాని.. ప్లేట్ పూరీల‌ను(2) 2 వేల రూపాయల‌కు ద‌క్కించుకున్నారు. ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఆదోనిలో జ‌రిగింది. మంగ‌ళ‌వారం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఎమ్మెల్యే కార్య‌క్ర‌మంలో భాగంగా టీడీపీ నేత‌, క‌ర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్ట‌ర్ పార్థ‌సార‌థి స్థానిక వాల్మీకి న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఓట‌రు జాబితా, స‌ర్ ప్ర‌క్రియ‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయితే.. అనూహ్యంగా రోడ్డు ప‌క్క‌న ఓ చిన్న‌పాటి హోట‌ల్‌ను న‌డుపుతున్న మ‌హిళ ఆయ‌న‌కు క‌నిపించారు.

ఆమెకు కూడా స‌ర్‌పై అవగాహ‌న క‌ల్పించేందుక‌ని హోట‌ల్‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆమె పూరీలు వేస్తున్నారు. దీనిని చూసి ముచ్చ‌ట‌ప‌డ్డ ఎమ్మెల్యే పార్థ‌సార‌థి.. తానుకూడా గ‌రిటె తిప్పుతాన‌ని చెప్పి.. స్వ‌యంగా పొయ్యి వ‌ద్ద‌కుచేరుకున్నారు. అది గ్యాస్ పొయ్యే అయినా.. స‌ద‌రు హోట‌ల్ నిర్వాహ‌కురాలు నేల‌పైనే కూర్చుని పూరీలు వేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే కూడా నేల పైనే ఓ చిన్న‌పాటి స్టూల్‌పై పొయ్యి ముందు కూర్చుని పూరీలు వేశారు. తొలుత అప్ప‌టికే క‌లిపి ఉంచిన పూరీ పిండి ముద్ద‌ల‌ను రోర‌ల్‌తో పూరీలుగా అద్ది.. పెద్ద‌విగా చేశారు. అనంత‌రం వాటిని నూనెలో వేసి.. గ‌రిటెతో తిప్పుతూ.. చ‌క్క‌గా పూరీలు త‌యారు చేశారు.

ఇలా.. నాలుగు వాయిల్లో మొత్తం 8 పూరీల‌ను ఎమ్మెల్యే వేశారు. అయితే.. ఎమ్మెల్యేవేసిన పూరీల‌ను కొనేందుకు జ‌నాలు, పార్టీ అభిమానులు ఎగ‌బ‌డ్డారు. దీంతో ఓ నాయ‌కుడు ఈ పూరీల‌కు వేలం నిర్వ‌హించారు. మొత్తం నాలుగు ప్లేట్ల (రెండేసిచొప్పు న 8 పూరీలు)ను వేలం వేయ‌గా.. తొలి ప్లేట్ పూరీల‌ను ఓ కార్య‌క‌ర్త 2 వేల రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్నారు. మిగిలిన మూడు ప్లేట్ల పూరీల‌ను కూడా స్థానికులు 500 చొప్పున సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. పూరీల‌ను అందంగా వేశారంటూ.. స్థానికు లు ఎమ్మెల్యేను కొనియాడారు.

కాగా.. నేల‌పై కూర్చుని వండుతూ.. హోట‌ల్ న‌డుపుతున్న నిర్వాహ‌కురాలి స‌మ‌స్య‌లు తెలుసుకున్న ఎమ్మెల్యే.. హోట‌ల్ ఆధునీక‌ర‌ణ‌కు నిధులు ఇస్తాన‌ని.. అలానే బ‌ల్ల‌ల‌ను కూడా కొనిస్తాన‌ని వాట‌ర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడుతూ.. స్థానికంగా తిరుగుతుంటే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుస్తున్నాయ‌ని.. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం మ‌రింత పెరిగింద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమం ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. చిన్న‌పాటి స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, పెద్ద స‌మ‌స్య‌ల‌ను మంత్రులు, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తాన‌న్నారు.

Tags:    

Similar News