పాకిస్తాన్‌కు భారీ షాక్.. భారతదేశంలో విలీనం వైపు పీఓకే ప్రజల చూపు?
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు రోజురోజుకూ నిప్పుల గుండంగా మారుతున్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు రోజురోజుకూ నిప్పుల గుండంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న వివక్ష, అణచివేతపై అక్కడి ప్రజలు తిరుగుబావుటా ఎగరవేశారు. తాము ఏమాత్రం పాకిస్తాన్‌లో భాగం కాదంటూ బహిరంగంగానే నినదిస్తున్నారు. ముఖ్యంగా రావల్‌కోట్ ప్రాంతంలో గత నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
‘మీ రేషన్ మాకొద్దు’.. పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం
రావల్‌కోట్‌లో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో నిరసనకారులు పాక్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. "మీరిచ్చే రేషన్ మాకు అవసరం లేదు. మా వనరులను మీరే దోచుకుంటున్నారు. నిత్యావసరాలు రాకుండా నిర్బంధాలు విధిస్తూ మాకు నరకం చూపిస్తున్నారు. మా ప్రాణాలను కాపాడుకోవడానికి మాకు వేరే దారి ఉంది, త్వరలోనే ఆ మార్గాన్ని ఎంచుకుంటాం" అంటూ ప్రొటెస్టర్లు తేల్చి చెప్పారు. పరిస్థితిని అదుపు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి హింసాత్మక అణచివేతకు పాల్పడినప్పటికీ ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎదురుతిరిగి ఆర్మీపైనే దాడులు చేస్తూ తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని.. ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన సమీకరణాలు
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఊహించని స్థాయిలో సానుకూల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు అశాంతికి నిలయంగా ఉన్న కశ్మీర్ లోయ, నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అత్యంత దుర్లభమైన కొండ ప్రాంతాలకు సైతం విద్యుత్, రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చాయి. కశ్మీర్‌లో శాంతియుత వాతావరణంలో స్థానిక సంస్థల, అసెంబ్లీ ఎన్నికలు జరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. పర్యాటకం, వాణిజ్యం పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. సరిహద్దు అవతల భారత్‌లో జరుగుతున్న ఈ అద్భుతమైన అభివృద్ధిని చూసి పీఓకే ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. తాము కూడా భారతదేశంలో విలీనమైతేనే తమ భవిష్యత్తు బాగుంటుందనే భావన వారిలో బలంగా నాటుకుంటోంది.
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్.. తదుపరి పరిణామాలేంటి?
ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు పీఓకే నిరసనలు కోలుకోలేని షాక్‌గా మారాయి. ఒకవైపు అంతర్గత రాజకీయ కలహాలు, మరోవైపు పీఓకే లో పెరుగుతున్న తిరుగుబాటు పాక్ పాలకులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తాము భారత్‌లో విలీనం కావడానికి సిద్ధమంటూ అక్కడి ప్రజలు ఇస్తున్న సంకేతాలు భవిష్యత్తులో సరిహద్దుల్లో సంచలన రాజకీయ, భౌగోళిక పరిణామాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. నిరసనలను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం మరింత ఉధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.