తెలంగాణ రైతుకు పండగ.. భరోసా నిధులు విడుదల
తెలంగాణ రైతాంగానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు.
తెలంగాణ రైతాంగానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం.. శిల్పకళా వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు.. రైతులకు నిధులను జమ చేశారు. ఖరీఫ్ సీజన్‌లో తొలి విడతగా రెండు ఎకరాలు ఉన్న రైతులకు నిధులు మంజూరు చేశారు. వారి ఖాతాల్లో 2,482.02 కోట్ల రూపాయలు జమ చేశారు. తొలివిడతలో 44.28 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
బకాసురుడు!
మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను బకాసురుడితో పోల్చిన సీఎంరేవంత్ రెడ్డి.. రాష్ట్రాన్ని పదేళ్ల కాలంలో అప్పుల మయం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో 69 వేల కోట్లు మాత్రమే ఉండగా.. కేసీఆర్ పాలనలో ఇది 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆ అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు. ఆ అప్పులే లేకపోతే.. రైతులకు మరింతగా సాయం అందించే వారమని చెప్పారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి మునుపెన్నడూ లేని విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
రైతులు తలెత్తుకుని జీవించే పరిస్థితిని ఇందిరమ్మ పాలనలో కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కల్వకుంట్ల చేసిన అప్పులు, తప్పులు చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ``ఒకటా రెండా.. తవ్వినకొద్దీ అనేకం బయట పడుతున్నాయి`` అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయకపోగా.. దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ప్రజలకు మేలు చేయకపోగా.. సొంతానికి మేలు చేసుకున్నారని విమర్శించారు. గడిచిన 30 నెలల తమ పాలనలో రైతులకు చేసిన మేళ్లపై పుస్తకమే ముద్రించినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ పాలనలో రైతులను రాజుల లెక్క చూస్తున్నామన్నారు.
వారిద్దరూ రాష్ట్రంపై పడ్డారు: భట్టి
వారిద్దరూ రాష్ట్రంపై పడి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారంటూ.. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్‌రావు పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. పదేళ్లు మంత్రులుగా పనిచేసిన వారికి ప్రస్తుత ప్రభుత్వం మంచి చేస్తున్నా ఓర్చుకునే లక్షణం, ఓపిక, ఓర్పు లేకపోవడం దారుణమన్నారు. రైతులను వంచించారని దుయ్యబట్టారు. 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి.. ఆ సొమ్మును ఏం చేశారని ప్రశ్నిస్తే.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం మొత్తం ఈ ఇద్దరి పనితీరును గమనిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. ఆ భారం లేకపోయి ఉంటే మరింతగా సాయం చేసేవారని భట్టి వ్యాఖ్యానించారు.