చిరంజీవి సతీమణి సురేఖకు పదవి.. సీఎం రేవంత్ స్ట్రాటజీ ఏమిటి?

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు నియామకంపై తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Update: 2026-07-01 04:00 GMT

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు నియామకంపై తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు ఈ బోర్డులో సభ్యురాలిగా చోటు కల్పించడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త 'మెగా' స్ట్రాటజీ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం కేవలం ఒక ఆలయ కమిటీ నియామకం మాత్రమే కాకుండా దీని వెనుక బలమైన రాజకీయ, సామాజిక సమీకరణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

తెలంగాణ తిరుపతిగా గుర్తింపు పొందిన యాదాద్రి ఆలయ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎంఎస్ఎన్ గ్రూప్ ఛైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డికి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. కార్పొరేట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆయన నాయకత్వంలో ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ బోర్డులో ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, సి. విజయరాజం, తూళ్ల విజయేందర్, పి. ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం. రాఘవేంద్రరావు, డి. లక్ష్మీనారాయణ నాయక్ వంటి వివిధ సామాజిక, రాజకీయ రంగాల ప్రముఖులకు స్థానం కల్పించారు.

కొణిదెల సురేఖ నియామకం.. రేవంత్ రెడ్డి 'మెగా' స్ట్రాటజీ ఏంటి?

ఈ మొత్తం బోర్డు నియామకాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కొణిదెల సురేఖ ఎంపికే. చిరంజీవి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్, సామాజిక వర్గాల ప్రభావం సామాన్యమైనది కాదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక కారణాలు కనిపిస్తున్నాయి..

మెగా కుటుంబంతో సత్సంబంధాలు

ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సాన్నిహిత్యంగా ఉంటున్నారు. సురేఖకు ఈ పదవి ఇవ్వడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయం నుండి కాంగ్రెస్ వైపు మెగా కుటుంబానికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పుడు సురేఖకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అటు సినీ పరిశ్రమకు, ఇటు ఆయా సామాజిక వర్గాలకు ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపినట్లయింది. తెలంగాణవ్యాప్తంగా విస్తరించి ఉన్న లక్షలాది మంది మెగా అభిమానుల అభిమానాన్ని, సానుకూలతను సొంతం చేసుకోవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.

ఆధ్యాత్మిక, సామాజిక కోణం

సురేఖ కేవలం సెలబ్రిటీ మాత్రమే కాదు.. ఆమె తెరవెనుక అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాబట్టి ఆమె అనుభవం ఆలయ సేవా కార్యక్రమాలకు ప్లస్ అవుతుందని ప్రభుత్వం భావించింది.

కొత్త బోర్డు ముందున్న సవాళ్లు.. లక్ష్యాలు

లక్షలాది మంది భక్తులు దర్శించుకునే యాదగిరిగుట్టలో ప్రసాదాల నాణ్యత, వసతి గదుల కొరత, పార్కింగ్ సమస్యలు, భద్రత, పరిశుభ్రత వంటి అంశాలపై కొత్త బోర్డు తక్షణమే దృష్టి సారించాల్సి ఉంది. కార్పొరేట్ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులతో కూడిన ఈ జంబో టీమ్ యాదాద్రిని దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతుందో లేదో చూడాలి. ఏదేమైనా రేవంత్ రెడ్డి వేసిన ఈ 'మెగా' వ్యూహం మాత్రం ప్రస్తుతానికి సూపర్ హిట్ అనే చెప్పాలి.

Tags:    

Similar News