హోం మంత్రిగా అనిత‌.. రెండేళ్ల‌లో ప‌నితీరు ఇదే.. !

రాష్ట్ర హోం శాఖ మంత్రిగా వంగ‌ల‌పూడి అనిత రెండు సంవత్స‌రాలు పూర్తి చేసుకున్నారు.

Update: 2026-07-01 02:45 GMT

రాష్ట్ర హోం శాఖ మంత్రిగా వంగ‌ల‌పూడి అనిత రెండు సంవత్స‌రాలు పూర్తి చేసుకున్నారు. టీడీపీ పాల‌న లో 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే.. తొలిసారి హోం శాఖ‌ను మ‌హిళ‌కు కేటాయించారు. మ‌రీ ముఖ్యంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికిచెందిన నాయ‌కురాలికి అప్ప‌గించారు. ఇది పార్టీ ఇచ్చిన గొప్ప అవ‌కాశమ‌నే చెప్పాలి. ఉన్న‌త విద్యావంతురాలు.. మాజీ టీచ‌ర్‌.. కావ‌డంతో అన్ని విధాలా అనిత ఎంపికస‌రైం దే నని చెప్పాలి. మ‌రి ఈ రెండేళ్ల‌లో అనిత ఏమేర‌కున్యాయం చేశార‌న్నది ప్ర‌శ్న‌.

క‌త్తిమీద సాము..!

హోం శాఖ అంటేనే ఏరాష్ట్రంలో అయినా.. క‌త్తిమీద సామ‌నే చెప్పాలి. ఏపీలో మ‌రింత ఎక్కువ‌గా ఉంది. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ ఆధిపత్య రాజ‌కీయాలు సాగుతున్న నేప‌థ్యంలో ఏపీలో హోం శాఖ‌ను నిర్వ‌హించడం అంటే.. అంత ఆషామాషీ కాదు. అయినా.. అనిత త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నార‌నే చెప్ప లి. వైసీపీ నుంచి వ‌స్తున్న సవాళ్ల‌ను ఎదుర్కొనే విష‌యంలోనూ..సొంత పార్టీలో కొంద‌రు చేస్తున్న ప‌నుల కార‌ణంగా ప్ర‌భుత్వానికి మ‌చ్చ‌రాకుండా చూసుకునే విష‌యంలోనూ ఆమెత‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని మేళ విస్తున్నారు.

పోలీసుల‌పై ప‌ట్టెంత‌..?

గతంగా వైసీపీపాల‌న‌లో హోంశాఖ మంత్రులుగా ప‌నిచేసిన సుచ‌రిత‌, వ‌నిత‌ల‌తో పోల్చుకుంటే.. ప్ర‌స్తుత మంత్రి అనిత‌.. పోలీసు శాఖ‌పై ప‌ట్టు పెంచుకున్నారు. నిరంత‌రం స‌మీక్ష‌లు చేస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త విష‌యంలో సూచ‌న‌లు చేస్తున్నారు. ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ‌కు నేరుగా వెళ్తున్నారు. తొలి ఏడాదే.. క‌ర్నూలులో జ‌రిగిన ఓ ఘ‌ట‌న విష‌యంలో ఆమె స్పందించిన తీరుతో నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌డం.. సునాయాసంగా మారింది. అలాగే.. సింహాద్రి ఆల‌యంలో గోడ కూలిన ఘ‌ట‌న‌పైనా.. ఆమె స్పంద‌న వేగంగానే ఉంది.

రాజ‌కీయంగా..

ఒక వైపు హోం మంత్రిగా ఉంటూనే.. మరోవైపు.. రాజ‌కీయంగా కూడా అనిత ఆశించిన తీరులో అడుగులు వేస్తున్నారు. వైసీపీకి కౌంట‌ర్లు ఇవ్వ‌డంలో పార్టీ నాయ‌కుల‌ను ఓవ‌ర్ టేక్ చేస్తున్నారు. స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందిస్తున్నారు. దీంతో కేవలం త‌న శాఖ‌కే ఆమె ప‌రిమితం కాకుండా.. రాజ‌కీయంగా కూడా.. ఆమె ప‌దునైన మాట‌తీరును కొన‌సాగిస్తున్నారు. అయితే.. సాధార‌ణంగా ఉండే.. చిన్న‌పాటి స‌మ‌స్య‌లు మంత్రిని ఒక్కొక్క‌సారి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గంజాయి నిర్మూల‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించినా.. ఇంకా పూర్తిస్థాయిలో క‌ట్ట‌డి చేయ‌లేక పోయారు.

పోలీసుల అవినీతి అరిక‌ట్టలేక పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. క్షేత్ర‌స్థాయిలో పోలీసింగ్‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తామ‌ని చెప్పినా.. ఈ విష‌యంలో చేత‌లు ముందుకు సాగ‌డం లేదు. ఇప్ప‌టికీ.. పోలీసు స్టేష‌న్లు.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు దూరంగానే ఉంటున్నాయి. ఈ విష‌యాల‌ను వ‌చ్చే రెండేళ్ల‌లో ఆమె స‌రిచేసుకుంటే.. హోం శాఖ‌పై అనిత త‌న‌దైన ముద్ర వేయ‌గ‌లుగుతారు. అయితే.. స్త్రీశ‌క్తి వంటి యాప్‌లు తీసుకురావ‌డం ద్వారా మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచేందుకు కృషి చేస్తుండ‌డం ప్ర‌శంసించాల్సిన అంశం గా ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News