గవర్నర్ అశోక్ వైసీపీ మీద ఎటాక్ !
గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఏడాది క్రితం రాజ్ భవన్ బాట పట్టారు. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు.
గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఏడాది క్రితం రాజ్ భవన్ బాట పట్టారు. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. రాజకీయాలు అయితే మాట్లాడకూడదని అంటారు. అయితే రాజు గారు మాత్రం తాను ఎపుడు విజయనగరం పర్యటనకు వచ్చినా వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తూనే ఉంటున్నారు అని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు. తనను అయిదేళ్ల పాటు వైసీపీ కేసులు పెట్టి లాగిందని రాజు గారు తాజాగా విమర్శించారు. ఈ మధ్యనే ఆయన పుట్టిన రోజు వేడుకలను తన బంగ్లాలో జరుపుకున్నారు. టీడీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతలు అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక రాజు గారు తన బర్త్ డే ఇలా అయిందో లేదో అలా వైసీపీ మీద విమర్శల జోరు పెంచారు.
సంచలన ఆరోపణలతో :
గవర్నర్ హోదాలో అయినా తనకు సమస్యలు ఉండవా తన సొంత ఆస్తులకు ఇబ్బంది కలుగుతూంటే చూస్తూ ఊరుకోవాలా అని రాజు గారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఆరోపణలు జిల్లాలో రాజకీయ సంచలనానికి దారి తీశాయి. తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులలో మార్చేసి వైసీపీ అధికారంలో ఉన్నపుడు లీజుకు తీసుకుని అక్కడ పార్టీ ఆఫీసు కట్టుకున్నారని మండిపడ్డారు. దీని మీద జిల్లా కలెక్టర్ కి లేఖ రాశామని అన్నారు. ఆ భూమి తమదని అన్ని ఆధారాలు ఉన్నాయని రాజు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు చట్టపరమైన ప్రక్రియను ఏ మాత్రం పాటించకుండా తమ కుటుంబ ఆస్తి ప్రైవేట్ భూమిని పార్టీ ఆఫీసుకు లీజుగా ఎలా తీసుకుంటారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ కౌంటర్ తోనే :
ఇక వైసీపీ కూడా ఈ విషయంలో ఊరుకోవడం లేదు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అయితే ఆ భూమి ప్రభుత్వందే అని అన్నారు. తాము 2021లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని నగర పాలక సంస్థ జీవోతో పాటు ప్రభుత్వ జీవో రెవిన్యూ శాఖ అనుమతులతోనే తాము ఆ భూమిలో పార్టీ ఆఫీసుని నిర్మిస్తున్నామని అన్నారు. అక్కడ అక్రమాలు జరిగాయి అన్నది రాజకీయ విమర్శలు మాత్రమే అని అంటున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవి గవర్నర్ హోదాలో ఉండి అశోక్ ఈ తరహా విమర్శలు చేయడం అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని శ్రీనివాసరావు అంటున్నారు.
హీటెక్కించిన పాలిటిక్స్ :
ఇదిలా ఉంటే గవర్నర్ గా అశోక్ ఉన్నారు. ఈ రోజుకీ విజయనగరం జిల్లా టీడీపీలో అత్యధికులు ఆయన మాటనే వింటారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఎంతో మంది ఉన్నారు. వారి చేత ఈ విమర్శలు చేయించకుండా రాజు గారే నేరుగా ఫీల్డ్ లోకి దిగడం వెనక వ్యూహం ఏమైనా ఉందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి రాజ్యంగ పదవిలోకి రాజు గారు వెళ్ళాక ఆయన వారసురాలిగా ఉన్న విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అంత దూకుడు చేయలేకపోతున్నారు. దాంతో రాజు గారు మళ్ళీ స్పీడ్ పెంచాల్సి వస్తోంది అని అంటున్నారు. అంటే ఆయన రాజ్ భవన్ తో పాటుగానే సొంత జిల్లా రాజకీయాల మీద కూడా ఫోకస్ పెడుతున్నారా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మరి చూడాలి రాజు గారి విమర్శలు వైసీపీ ప్రతి విమర్శలతో వేడి పుట్టించిన జిల్లా రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.