బెంగాల్ మోడల్ ...తెలంగాణాకు సూట్ అవుతుందా ?

బీజేపీ పెద్దలు తెలంగాణా మీద గంపెడాశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పీఠమెక్కుతామని ధీమాగా చెబుతున్నారు.

Update: 2026-07-01 03:50 GMT

బీజేపీ పెద్దలు తెలంగాణా మీద గంపెడాశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పీఠమెక్కుతామని ధీమాగా చెబుతున్నారు. ఇక తాజాగా చూస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అయితే పశ్చిమ బెంగాల్ నే గెలిచాం, తెలంగాణాను గెలవలేమా అంటున్నారు. బెంగాల్ తరహా పాలిటిక్స్ ని తెలంగాణాలో చేసి చూపిస్తామని కూడా ధీమాగా ప్రకటిస్తున్నారు. నిజానికి చూస్తే ఒక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేరే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి. వేటికీ ఎక్కడా పొంతన ఉండదు, ఇది కామన్ పాయింట్. ఈ లాజిక్ ని బీజేపీ పెద్దలు అతి ఉత్సాహంతో మిస్ అవుతున్నారా అన్నదే చర్చగా ఉంది మరి.

తెలంగాణాలో వికసించేది ఎలా :

తెలంగాణాలో బీజేపీ వికసించేది ఎలా అన్న చర్చ ఎపుడూ వస్తూనే ఉంది. దానికి కారణం పార్టీ పెద్దలు చేసే అనేక ప్రయోగాలే అని అంటున్నారు. ఇక కేంద్ర నాయకత్వం ఏమి కోరుకుంటోంది అన్నది రాష్ట్ర నాయకత్వానికి తెలియదని అంటారు, అలాగే రాష్ట్ర నాయకత్వం ఆలోచనలు కేంద్ర నాయకత్వం పసిగట్టలేక పోతుంది అని అంటున్నారు. లోకల్ లీడర్స్ కి మరింత చాన్స్ ఇచ్చి వారిని యాక్టివ్ చేసి జనంలోకి పంపిస్తేనే మేలు అయిన ఫలితాలు వస్తాయని అంటున్నారు. అలా కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షులు ప్రధాని హోం మంత్రి వంటి వారు వచ్చి ప్రసంగాలు పర్యటనలు చేసి వెళ్తే ఏమి లాభమని అంటున్నారు.

వర్గ పోరుతో సతమతం :

బీజేపీలో అయితే వర్గ పోరు ఉంది అన్నది కేంద్ర పెద్దలకు తెలుసు అని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు కొత్తగా వచ్చిన వారు హార్డ్ కోర్ హిందూత్వ సాఫ్ట్ కోర్ హిందూత్వ ఇలా అనేక రకాలుగా విభజన ఉంది. ఇక పట్టణ స్థాయి లీడర్స్ క్లాస్ లీడర్స్ బీజేపీలో ఎక్కువ అని అంటున్నారు. రూరల్ సెక్టర్ లో పట్టు ఉండి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ల వల్లనే ఓట్లు రాలుతాయని అంటున్నారు. ఆ విషయంలో బీజేపీ వెనకబడుతోంది అని విశ్లేషిస్తున్నారు. ఇక కేంద్ర పెద్దలకు రాష్ట్ర నేతలకు పార్టీకి క్యాడర్ కి జనాలకు పార్టీకి ఇలా అనేక రకాలైన గ్యాప్స్ ఉన్నాయి. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తడవకోసారి జాతీయ నేతలు వచ్చి గెలిచేస్తున్నామని చెప్పి పోతే అవి రొటీన్ ప్రకటనలుగా మారిపోతున్నాయని అంటున్నారు. జనాల సంగతి కాదు క్యాడర్ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోని విషయంగా ఉంది అని అంటున్నారు.

పప్పులుడకవు అంటున్నారు :

పశ్చిమ బెంగాల్ లో గెలిచేశామని తెలంగాణాలో గెలుస్తామని అనుకుంటే పప్పులు ఉడకవని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పెద్దలకు బెంగాల్ లో గెలుపు సంగతి ఏమో కానీ తెలంగాణాలో ఆశలు పెట్టుకోవద్దని ఆయన చెప్పేశారు. మమతా బెనర్జీ మీద గెలిచి ఉండవచ్చు కానీ తెలంగాణా సమాజాన్ని గెలవడం కష్టమని తెలుసుకోవాలని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి మరో మాట అన్నారు. అది సెటైరికల్ గా కనిపించినా అందులో కూడా మ్యాటర్ ఉంది. ప్రతీ దానికీ ప్రతీ ఎన్నికకూ మోడీ వస్తే ఎలా అని ప్రశ్నించారు. జనాలకు స్థానిక నేతలు నచ్చాలి కానీ ఢిల్లీ పెద్ద మనుషులు ఎందుకు అని ఎద్దేవా చేశారు. మోడీ వచ్చి మోరీ క్లీన్ చేస్తారా ఎందుకు పంచాయతీ ఎన్నికలకు కూడా ప్రచారం అని గట్టిగానే కౌంటర్లు వేశారు.

బెంగాల్ అనుకూలతలు :

ఇక రేవంత్ మరో మాట అన్నారు. బెంగాల్ లో పదిహేనేళ్ళు శ్రమిస్తే బీజేపీ గెలిచిందని తెలంగాణాలో ఎన్నేళ్ళు అయినా గెలిచేది ఉండదని. మరో విషయం ఏంటి అంటే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే నేరుగా ఢీ కొట్టాయి. అక్కడ రెండు పార్టీల వ్యవస్థ ఉంది. పైగా ముస్లిం ఓటు బ్యాంక్ అంటూ హిందూత్వ కార్డుని బాగా వాడేసారు. ఇక తృణమూల్ నుంచి పెద్ద నాయకుడు సువేందు అధికారి వచ్చి బీజేపీలో కలిశాకనే ఊపు వచ్చింది. తెలంగాణాలో ఆ దిగ్గజ నేత ఎవరు అన్న అన్వేషణ ఉండనే ఉంది. ఇలా అనేక లెక్కలు బెంగాల్ కి తెలంగాణాకు అసలు కుదరడం లేదు, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వస్తే వెంటనే అందుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల బెంగాల్ విజయం జపం మాని ఆ మోడల్ ని పక్కన పెట్టి తెలంగాణా పొలిటికల్ రూట్స్ ని గమనిస్తూ కొత్త రాజకీయానికి బీజేపీ శ్రీకారం చుడితే మంచిది అని అంటున్నారు.

Tags:    

Similar News