జ‌నం మాట స‌రే.. ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి ..?

టీడీపీ నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో సానుకూల ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

Update: 2026-07-01 03:00 GMT

టీడీపీ నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో సానుకూల ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల కోణంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మంచి మార్కులే ప‌డుతున్నాయి. ఇక‌, మంత్రుల్లో కొంద‌రికి కొంత వ్య‌తిరేక‌త క‌నిపిస్తున్నా.. అది పెద్దగా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. ఓవ‌రాల్‌గా సీఎం, డిప్యూటీ సీఎంల విష‌యంలో సానుకూల ధోర‌ణి ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల సంతృప్తి కూడా వారిని సెంట్రిక్‌గా చేసుకునే ఉంటుంది. కాబ‌ట్టి వారిపై వ్య‌తిరేక‌త లేదు.

ఇక‌, ఎటొచ్చీ.. ఇప్పుడు ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి క‌నిపిస్తోంది. ఈ మాట ఎవ‌రో అన్న‌ది కాదు. సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యేలు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే చేస్తున్న వ్యాఖ్య‌లు. వారు ఏ ఉద్దేశంతో ఈ కామెంట్లు చేస్తున్నారో.. వారి అసంతృప్తి దేనిపై ఉందో కూడా వారే చెబుతున్నారు. తాజాగా రెండు రోజుల కింద‌ట విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బొండా ఉమా.. క‌ర్నూలుకు చెందిన మ‌రో ఎమ్మెల్యే కూడా త‌మ మ‌న సులోని అసంతృప్తిని బ‌హిర్గ‌తం చేశారు.

పార్టీలో ఎప్ప‌టినుంచో ఉన్న‌వారికి ఎలాంటి గుర్తింపు లేద‌ని.. ఇప్పుడిప్పుడు వ‌చ్చిన వారికి.. పార్టీ సిద్ధాంతాల‌పై ప‌ట్టులేని వారికి ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌ని ఇరువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి వీరు కూడా 15 ఏళ్ల కింద‌టే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అయినా.. త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌డం లేద‌ని ముఖ్యంగా మంత్రి ప‌ద‌వుల విష‌యంలో త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని వారు చెబుతున్నారు. ప్ర‌స్తుత వీరి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

వీరిద్ద‌రూ బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ.. ఇంకా మ‌రికొంద‌రు కూడా ఇదే అభిప్రాయంతోనే ఉన్నార‌ని పార్టీకి స‌మాచారం ఉంది. సీనియ‌ర్ నేతలు చాలా మంది త‌మ‌కు ప‌దవులు ద‌క్క‌డం లేద‌ని అంటున్నారు. ఒక‌రిద్ద‌రు అయితే.. త‌మ‌కు లేక‌పోయినా ఫ‌ర్వాలేద‌ని.. త‌మ వారికైనా నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని కోరుతున్నా అవి కూడా ల‌భించ‌డం లేద‌ని చెబుతున్నారు. అయితే.. ఇలాంటి అసంతృప్తులు కామ‌నే అయినా.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భావం ప‌డ‌కుండా అధిష్టానం ఇలాంటి వారిని పిలిచి మాట్లాడితే బాగుంటుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Tags:    

Similar News