'ఏజెన్సీ' ఓట్ల కోసం పవన్ తో స్పెషల్ ఆపరేషన్
విపక్షం వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న ఏజెన్సీ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారు.
విపక్షం వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న ఏజెన్సీ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారు. 2009 నుంచి టీడీపీకి మింగుడుపడని ఏజెన్సీ నియోజకవర్గాల్లో పట్టు సాధించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అప్పగించారని అంటున్నారు. అంతేకాకుండా పవన్ కూడా ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి కూటమి పార్టీల బలోపేతానికి కృషి చేస్తున్నారని అంటున్నారు. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు మంత్రిగా ఉన్న పవన్ తన పరిధిలో ఏజెన్సీ గ్రామాలకు రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ గిరిజనుల మనసు దోచుకుంటున్నారని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ స్థానంలో ఎదగాలని కూటమి పార్టీలు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ ఏపీలో ఎప్పుడు ఎన్నికల నాటి రాజకీయ వేడి కొనసాగుతుంటుంది. ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమంలోనూ కూటమికి వన్స్ మోర్ అవకాశం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తుంటుంది. అంతేకాకుండా గతంలో తమకు చిక్కని ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టుసాధించేలా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు రంగంలోకి దింపిందని అంటున్నారు. అందుకే ఆయన ఎక్కువగా గిరిజనులు నివసించే ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడంతోపాటు వారి జీవనోపాధి విషయంలో అధిక ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా అడవి తల్లి బాట పేరిట 75 ఏళ్లలో రోడ్డు నోచుకోని గ్రామాలకు రహదారులు వేస్తున్నారని చెబుతున్నారు.
పవన్ పనితీరుతో ఏజెన్సీ ప్రాంతంలో కూటమికి క్రేజ్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. సినీ హీరోగా పవన్ కు ఉన్న ఆదరణతోపాటు మంత్రిగా ఆయన ఎక్కువగా గిరిజన ప్రాంత అభివృద్ధి పట్ల అంకితభావం చూపుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గతం కంటే ఏజెన్సీ ప్రాంతంలో తమ బలం పెరిగిందని కూటమి నేతలు విశ్లేషిస్తున్నారు. నిజానికి 2009 నుంచి ఏజెన్సీలో వైసీపీకే ఎక్కువ పట్టు ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ గెలిచిన 11 స్థానాల్లో రెండు విశాఖ ఏజెన్సీవి కావడం గమనార్హం. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కచోట కూడా టీడీపీ గెలవలేకపోయింది. 2024 ఎన్నికల్లో కూటమి సునామీలోనూ అరకు పార్లమెంటు సీటును వైసీపీ గెలుచుకోగలిగింది.
ఈ నేపథ్యంలో గడిచిన పదిహేనేళ్లలో టీడీపీకి ఏజెన్సీలో పట్టు సాధించడం కుదరడం లేదన్న విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. దీంతో ఏజెన్సీ వాసులను ఆకర్షించేందుకు పవన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకుంటున్నారని అంటున్నారు. పవన్ సైతం తన ప్రత్యేక రాజకీయ వ్యూహంతో ఏజెన్సీ వాసులకు దగ్గరవుతున్నారని చెబుతున్నారు. ఏజెన్సీ పరిధిలో రోడ్లు వేయడమే కాకుండా గిరిజనులకు ఇబ్బంది కరంగా మారిన ఏనుగుల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం, విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా ఆదివాసులకు దగ్గరయ్యారని అంటున్నారు. ఇది వచ్చే ఎన్నికల నాటికి ఓటుబ్యాంకుగా మారుతుందని, విపక్షంపై పైచేయి సాధించేందుకు ఉపయోగపడుతుందని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.