తమిళనాడు పోలీసుల డ్రామా.. సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు పోలీసుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు పోలీసుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ లో చోటుచేసుకున్న తొక్కిలాట సమయంలో పోలీసుల తీరును ఆయన దుయ్యబట్టారు. అయితే అప్పట్లో ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు అలా ప్రవర్తించారని డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ దళపతి విజయ్ పోలీసులపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. శుక్రవారం కరూర్ లో పర్యటించిన సీఎం విజయ్ గతాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నిర్ణయించిన దళపతి విజయ్ 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై రాజకీయ ప్రత్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసినా, కోర్టు సానుకూల నిర్ణయం వెలువరించడంతో సీఎం చేతుల మీదుగా బాధితులకు నియామకపత్రాలు అందజేశారు.
ఎన్నికల ప్రచారంలో తనను చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబ సభ్యులను ఆదుకోవడం నైతిక బాధ్యతగా సీఎం విజయ్ భావించారు. పార్టీ పరంగా గతంలోనే ఆర్థిక సాయం చేసినప్పటికీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. ఇక తాను నిర్ణయించుకున్నట్లే 32 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, వారికి నియామకపత్రాలు అందజేయడానికి సీఎం విజయ్ స్వయంగా కరూర్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన విజయ్ అప్పటి ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో పోలీసులపై ఫైర్ అయ్యారు.
కరూర్ ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జీవితంలోనే అత్యంత బాధాకరమైన రోజు. ఆ కుటుంబాల పరిస్థితి చూసినప్పుడు నా గుండె తరుక్కుపోయింది. అప్పుడే వారికి నేను అండగా ఉంటానని మాట ఇచ్చాను, ఆ బాధ్యతను నెరవేరుస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆ రోజు పోలీసులు డ్రామా ఆడారు. అయితే, వారిపై తీవ్ర రాజకీయ ఒత్తిడి ఉండటం వల్లనే వారు అలా వ్యవహరించాల్సి వచ్చింది. వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం" అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడును డీఎంకే నేతలు నిలువునా లూటీ చేశారని నిప్పులు చెరిగారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు, పరిపాలనా వైఫల్యాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. కాగా, కరూర్ ఘటన తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన టీవీకే బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా విజయ్ రాజకీయ అరంగేట్రం ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే, అధికార పక్షం కావాలని అడ్డంకులు సృష్టించిందని టీవీకే శ్రేణులు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశాయి. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో పోలీసులు విఫలమయ్యారని, నిఘా వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ ఘటన తర్వాత తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. బాధితుల కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా విజయ్ ప్రజల్లో, ముఖ్యంగా సామాన్య వర్గాల్లో తనకున్న పట్టును మరింత బలపరచుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా నిరూపించుకుని ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని భావించి ఇప్పుడు ఉద్యోగాలిచ్చారు.