రాయ‌లసీమ‌.. ఇలా ర‌గ‌లాల్సిందేనా..!

రాయ‌లసీమలో రాజ‌కీయాలు ర‌గులుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య సీమ‌లోని ప్ర‌తి జిల్లా లోనూ తీవ్ర‌స్థాయిలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2026-07-10 08:25 GMT

రాయ‌లసీమలో రాజ‌కీయాలు ర‌గులుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య సీమ‌లోని ప్ర‌తి జిల్లా లోనూ తీవ్ర‌స్థాయిలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఎవ‌రికి లాభిస్తుంది? ఎవ‌రికి న‌ష్టం చేస్తుంది ? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇలాంటి రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు ఏమేర‌కు స‌హిస్తార‌న్న‌ది కీల‌క అంశం. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య త‌లెత్తుతున్న వివాదాలు.. చినుకు చినుకు గాలివాన‌లా మారి.. ఉద్రిక్త‌త‌ల‌కు.. ర‌గ‌డ‌కు కూడా దారితీసింది.

ప్ర‌తి జిల్లాలోనూ..

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు రోడ్డున ప‌డ్డాయి. గ‌తానికంటే భిన్నంగా నాయ‌కు ల మ‌ధ్య స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఫ‌లితంగా నాయ‌కులు రోడ్డెక్కుతున్నారు. ఆళ్ల‌గ‌డ్డ‌, ఆదోని నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌లు హ‌ద్దులు మీరి ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయిసాధించుకునే వ‌ర‌కు వెళ్లింది. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ‌, మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర‌రెడ్డి వ‌ర్గీయులు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకునే దాకా ఈ వ్య‌వ‌హారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం రావ‌ణ కాష్టంగా ర‌గులుతూనే ఉంది. ఈ నియో జ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్ట‌నిచ్చేది లేద‌ని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అల్టిమేటం ఇవ్వ‌డం.. ఇరు ప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయాల‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తున్నాయి. త‌ర‌చుగా వివాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. పెద్దారెడ్డిపై ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌మోదు కాగా.. జిల్లా బ‌హిష్క‌ర‌ణ చేయాల‌ని జేసీ ప‌ట్టుబ‌డుతున్నారు.

ఇక‌, ఇదే జిల్లాలో తాజాగా మ‌డ‌క‌శిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజుకు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డికి మ‌ధ్య వివాదాలు భ‌గ్గుమ‌న్నాయి. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేశారంటూ రాజు నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే తోపుదుర్తి ఇంట్లో పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. కేసులు న‌మోదు చేశారు. ఇవి ఎంత దూరం వెళ్తాయో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎమ్మెల్యే పులివ‌ర్తి నానీకి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి మ‌ధ్య కూడా ఇలానే ప‌రిస్థితి అట్టుడుకుతోంది. పులివ‌ర్తి నానీ తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో చెవిరెడ్డి కుటుంబానికి స‌వాల్ రువ్వుతున్నారు. ఇలా.. సీమ‌లోని అన్ని జిల్లాల్లోనూ రాజ‌కీయాలు వేడెక్కా య‌నే చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితిని పార్టీలు స‌ర్దుబాటు చేయాలి త‌ప్ప‌.. చోద్యం చూస్తే.. అది మంచిది కాద‌న్న అభిప్రాయం నెల‌కొంది. ఒక‌వైపు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు.. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల రాజ‌కీయాల‌తో బిజీబిజీగా గ‌డుపుతున్నారు.

Tags:    

Similar News