ఏడాది మాధవ్...బీజేపీ గ్రాఫ్ ?

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పీవీఎన్ మాధవ్ నియమితులై ఏడాది కాలం పూర్తి అయింది. 2025 జూలై 8న ఆయన ఈ పదవిని అందుకున్నారు.

Update: 2026-07-10 03:43 GMT

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పీవీఎన్ మాధవ్ నియమితులై ఏడాది కాలం పూర్తి అయింది. 2025 జూలై 8న ఆయన ఈ పదవిని అందుకున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి నుంచి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. యువకుడు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి పార్టీకి సేవ చేసిన వారు బీజేపీలో కూడా వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఉన్న వారు ఉత్తరాంధ్ర కు చెందిన బీసీ నాయకుడు పైగా తండ్రి పీవీ చలపతిరావు జనసంఘ్ కాలం నుంచి బీజేపీ దాకా సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం ఇవన్నీ కలసి వచ్చి మాధవ్ కి ఈ ఉన్నత పార్టీ పదవి దక్కేలా చేశాయి. అయితే ఏడాదిలో మాధవ్ ఏపీలో బీజేపీని ఏ మేరకు బలోపేతం చేశారు అన్న చర్చ కమలం పార్టీలో సాగుతోంది.

నామినేటెడ్ పదవులు :

బీజేపీకి నామినేటెడ్ పదవులు దక్కే విషయంలో కూటమిలో కొంత ఉదాశీనత ఉంది అన్న బాధ క్యాడర్ లో ఉంది. అయితే ఆ విషయంలో మాత్రం మాధవ్ ప్రెసిడెంట్ అయినా మార్పు లేదని అంటున్నారు. అలాగే జనసేనకు లభించిన ప్రాధాన్యతలో సగం అయినా సాటి మిత్ర పక్షం అయిన బీజేపీకి దక్కడం లేదని వేదన కూడా నాయకులలో ఉంది అని అంటున్నారు. ఇక కూటమి రెండేళ్ళ హయాంలో బీజేపీకి రాజ్యసభ సీట్లు రెండు దక్కాయి. ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చారు. నామినేటెడ్ అయితే పెద్దగా కీలకమైనవి రాలేదని అంటున్నారు. దాంతో పనిచేసిన వారికి మాత్రం నిరాశగానే ఉంది అని అంటున్నారు.

దూకుడుగా ముందుకు :

ఇక యువకుడు అయిన మాధవ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతుందని ఆశించిన వారికి అది కూడా అంతగా కనిపించడం లేదని అంటున్నారు. బీజేపీ గ్రాఫ్ ఎంత మేరకు పెరిగింది అంటే అందులోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. ఇక బీజేపీ స్థానిక సంస్థల మీద ఫోకస్ పెట్టిందా అన్న చర్చ కూడా సాగుతోంది. అలా అయితే ఎంతమందికి టికెట్లు దక్కుతాయి అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఎందుకంటే టీడీపీకే అత్యధిక సీట్లు వెళ్తాయని అంటున్నారు. జనసేన తరువాత స్థానంలో ఉంటుంది, దాంతో ఇప్పటి నుంచే ఒత్తిడి తేకపోతే లోకల్ క్యాడర్ నష్టపోతుంది అని అంటున్నారు.

అంతా సైలెంట్ గానే :

ఇక బీజేపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. మాధవ్ సారధ్యం చేపట్టాక చాలా మంది సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. నిజానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ ఒక ఎమ్మెల్సీ, ఒక కేంద్ర మంత్రి ఇలా బీజేపీకి ఏపీలో ఉండాల్సిన బలం ఉంది అని గుర్తు చేస్తున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అధికారం ఉండగానే బీజేపీ బలపడాలని అంటున్నారు. కానీ ఎందుకో అనుకున్నంత జోరు అయితే కమలం పార్టీలో కనిపించడం లేదు అని అంటున్నారు.

పుంజుకుంటున్నాం :

ఇక చూస్తే మాధవ్ మాత్రం ఏడాది తన సారధ్యం మీద సంతృప్తిని వ్యక్తం చేశారు. గతానికి కంటే ఇపుడు పార్టీ బలం బాగా పెరిగింది అని అన్నారు. ఇంకా పుంజుకుంటామని చెప్పారు. మొత్తం కొత్త జిల్లాలతో కలుపుకుని కమిటీలను వేశామని గుర్తు చేశారు.అలాగే గ్రామ స్థాయి వరకూ బూత్ లెవెల్ వరకూ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం అంతా పటిష్టంగా ఉందని చెప్పారు. ఏడాదిలో అనేక కార్యక్రమాలను నిర్వహించాలని కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా బీజేపీ ఏపీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది అన్న భావన అయితే క్యాడర్ లో పూర్తిగా వ్యక్తం కావడం లేదని అంటున్నారు. మేము అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా తెలియని నిర్వేదంతో వారు ఉన్నారు. ఇకనైనా బీజేపీ ఏపీలో జోరు పెంచాలని అంటున్నారు.

Tags:    

Similar News