బిహార్ దొంగల నెక్స్ట్ లెవెల్ సాహసం.. 25 వేల వోల్టుల కరెంట్ వైర్‌నే లేపేశారు.. ఇలా ఉన్నారేంట్రా బాబు
ప్రపంచంలో ఎక్కడైనా దొంగలు బంగారం, వెండి, డబ్బులు.. మహా అయితే కార్లు, బైకులు దొంగతనం చేస్తారు. కానీ మన బిహార్ దొంగల రూటే సెపరేటు.. వారి టాలెంట్ ముందు హాలీవుడ్ ‘మనీ హైస్ట్’ దొంగలు కూడా మోకాళ్లూనాల్సిందే.
ప్రపంచంలో ఎక్కడైనా దొంగలు బంగారం, వెండి, డబ్బులు.. మహా అయితే కార్లు, బైకులు దొంగతనం చేస్తారు. కానీ మన బిహార్ దొంగల రూటే సెపరేటు.. వారి టాలెంట్ ముందు హాలీవుడ్ ‘మనీ హైస్ట్’ దొంగలు కూడా మోకాళ్లూనాల్సిందే. మొన్నటికి మొన్న ఏకంగా ఐరన్ బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, రైల్వే ట్రాక్‌లను పార్సిల్ చేసిన ఈ ఘనాపాటీలు.. తాజాగా తమ ‘క్రియేటివిటీ’కి మరింత పదును పెట్టారు. చావుకు ఎదురెళ్లి మరీ.. ఏకంగా 25,000 వోల్టుల హైటెన్షన్ రైల్వే విద్యుత్ కేబుల్‌ను కట్ చేసి ఎత్తుకెళ్లారు. అవును మీరు చదివింది నిజమే.. ప్రాణాలు పోతాయనే భయం అస్సలు లేకుండా కరెంట్ వైర్లనే లేపేశారు..
కథేంటంటే.. ఆర్పీఎఫ్ పోస్టు ముందే స్కెచ్
పట్నా-గయా ప్రధాన రైల్వే మార్గంలో ఈ విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. సాధారణంగా కరెంట్ వైర్ ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది.. అలాంటిది 25 కేవీ ఓవర్ హెడ్ విద్యుత్ వైర్‌ను దొంగిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ మన కిలాడీ దొంగలు సుమారు 100 మీటర్ల పొడవున్న ఈ భారీ కేబుల్‌ను చాలా పద్ధతిగా కత్తిరించి మాయం చేశారు.
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘనకార్యం జరిగిన ప్రాంతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టుకు అత్యంత సమీపంలోనే ఉందట.. "కంటికి రెప్పలా కాపాడాల్సిన" ఖాకీలు పక్కనే నిద్రిస్తున్నారో లేక వేరే పనుల్లో బిజీగా ఉన్నారో ఏమో కానీ.. దొంగలు మాత్రం తమ పనిని అత్యంత 'భద్రంగా' ముగించుకుని వెళ్లిపోయారు. బహుశా "ఇంత పెద్ద దొంగతనం మా ముందే ఎలా చేస్తారులే" అనే పోలీసుల నమ్మకాన్ని దొంగలు వమ్ము చేయలేదు.
రైళ్ల బ్రేక్.. ప్రయాణికుల తిప్పలు
ఈ కిలాడీల చేతివాటం వల్ల రైల్వే వ్యవస్థకు గట్టి షాకే తగిలింది. చోరీకి గురైన కేబుల్ రైళ్లకు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు గుండెకాయ లాంటిది. అది కాస్తా మాయమవ్వడంతో సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా ఢమాల్ అంది. ఫలితంగా 3 గంటల పాటు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత్యంతరం లేక అధికారులు ఒకే ట్రాక్‌పై సింగిల్ లైన్ పద్ధతిలో రైళ్లను నడపాల్సి వచ్చింది. కరెంట్ దొంగల పుణ్యమా అని వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో గంటల తరబడి నరకం చూశారు.
కరెంట్ షాక్ కొట్టలేదా సామీ?
ప్రస్తుతం రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. అయితే ఇంత హై-వోల్టేజ్ వైర్‌ను షాక్ కొట్టకుండా ఎలా కట్ చేశారనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనం చేసిన మహానుభావులకు రైల్వే ఇంజనీరింగ్ లేదా విద్యుత్ శాఖపై పీహెచ్‌డీ స్థాయి అవగాహన ఉండి ఉంటుందని నిపుణులు జోకులు వేస్తున్నారు. బహుశా ముందే పక్కా ప్లాన్ వేసి.. పవర్ సప్లై ఎప్పుడు ఆగుతుందో తెలుసుకుని మరీ రంగంలోకి దిగి ఉంటారని అనుమానిస్తున్నారు. "బిహార్‌లో బ్రిడ్జిలు మాయమైనప్పుడే అనుకున్నాం.. వీళ్లు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారని రేపు పొద్దున ఏకంగా నడుస్తున్న రైలు ఇంజిన్‌నే ఎత్తుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తుల రక్షణపై భద్రతా సంస్థలు ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే.. త్వరలోనే రైల్వే స్టేషన్లను కూడా దొంగలు హోల్ సేల్‌గా అమ్మేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.