పవన్ మార్క్ 'పల్లె పండుగ' తెచ్చిన మార్పు.. 19 నుంచి రెండో స్థానానికి రాష్ట్రం

కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిపాలన దక్షతకు కేంద్రం కితాబునిచ్చింది.

Update: 2026-07-10 07:29 GMT

కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిపాలన దక్షతకు కేంద్రం కితాబునిచ్చింది. డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో గ్రామీణాభివృద్ధి శాఖ రెండేళ్లలో ఊహించని మార్పు సంతరించుకుందని కేంద్రం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణంలో ఒకప్పుడు దేశంలో 19వ స్థానంలో ఉన్న రాష్ట్రం డిప్యూటీ సీఎం చొరవతో రెండో స్థానానికి ఎగబాకింది. ముఖ్యంగా పవన్ పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, పల్లె పండుగ పేరుతో రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రెండేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున రహదారులు అభివృద్ధి చెందాయని కేంద్రం ప్రకటించింది.

ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రం కొనియాడింది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న రోడ్లు ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. తాజాగా విడుదలైన ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY) జాతీయ నివేదికలో ఏపీ గ్రామీణ రోడ్ల నాణ్యతలో దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ రోడ్ల నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఉండేదని ఆ నివేదికలో కేంద్రం స్పష్టం చేసింది. నాటి ప్రభుత్వం రోడ్ల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు సాగించడం నరకప్రాయంగా ఉండేదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో అద్భుతమైన మార్పు సాధ్యమైందని అంటున్నారు.

పీఎంజీఎస్ వై నేషనల్ క్వాలిటీ మానిటరింగ్ విభాగం ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ నుండి ఈ ఏడాది మార్చి మధ్య జరిగిన పనులపై ప్రత్యేక నివేదికను రూపొందించింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 2,948 రోడ్లను పరిశీలించగా, అందులో 441 రోడ్లు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో తనిఖీ చేసిన 126 రోడ్లలో, కేవలం ఒక్క రోడ్డు మాత్రమే నాణ్యతలో వెనుకబడి ఉందని, మిగిలిన అన్నిరోడ్లు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు తగిన విధంగా నిర్మించారని ప్రకటించింది. రోడ్ల నిర్మాణంలో అత్యంత నాణ్యత పాటిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో దక్కించుకుందని కేంద్రం వెల్లడించింది.

'పవన్' మార్కు పాలన

ఒకప్పుడు రోడ్ల నాణ్యతలో 19వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రెండో స్థానానికి చేరడం వెనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉందని అంటున్నారు. 2024లో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా మారుమూల గ్రామాల ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు సైతం ఆయన శాఖ తక్షణమే స్పందించి, మరమ్మతులు చేపట్టడం ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంచిందని అంటున్నారు. ముఖ్యంగా పల్లె పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మారుమూల ప్రాంతాలతోపాటు ఏజెన్సీలోని కొండ ప్రాంతాలకు రోడ్లు నిర్మించారని అంటున్నారు.

Tags:    

Similar News