ఒకే వేదికపై వైసీపీ నేత అంబటి, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ.. మాటలు కలుస్తున్నాయా?
యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విజయవాడలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల, సామాజిక సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరుకాగా, ఆయన పక్కనే రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. భిన్నధృవాలైన మాజీ మంత్రి అంబటి, రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీవీ ఈ అంశంలో ఒకే గళం వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రావణ్ పై కేసు విషయంలో ఆ పార్టీలో కొంత గందరగోళం నెలకొందనే ప్రచారం నేపథ్యంలో అంబటి నేరుగా పాల్గొని తమ పార్టీ వాదన వినిపించారు. ఇదే సమయంలో ప్రజా సంఘాల నాయకుడిగా ఏబీవీ సైతం రావణ్ పై ఉపా చట్టం ప్రయోగించడాన్ని వ్యతిరేకించారు. గతంలో కూడా ఏబీవీ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మాజీ మంత్రి అంబటి, ఏబీవీ కలిసి ఒక సమావేశంలో పాల్గొనడమే కాకుండా, పక్కపక్కనే కూర్చోవడం రాజకీయ వర్గాలను ఆకర్షించింది. దీనికి గత వైసీపీ ప్రభుత్వంలో ఏబీవీ ఎదుర్కొన్న కష్టాలే కారణమంటున్నారు.
గతం గతః అన్నట్లు ఏబీవీ, మాజీ మంత్రి అంబటి పక్కపక్కనే కూర్చొని రావణ్ విషయంలో చర్చించుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు రిటైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అన్న కారణంతో 2019-24 మధ్య అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయన కనీసం పోస్టింగ్ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతో రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చి సాగనంపిందని అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరసన గళం వినిపిస్తున్న ఏబీవీ ఇప్పుడు వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడమే హాట్ టాపిక్ అవుతోంది.
రాష్ట్రంలో వివిధ సమస్యలపై గొంతు విప్పుతున్న రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీవీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతానని గతంలో ప్రకటించారు. అదే సమయంలో ప్రజా సమస్యలపైనా ప్రభుత్వాన్ని వెంటాడుతుంటానని హెచ్చరించారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడానికి సిద్ధపడిన ఏబీవీ భవిష్యత్తులో వారితో కలిసి రాజకీయం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అన్న చర్చకు తెరలేపారని అంటున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను బహిరంగంగా తప్పుబడుతున్న ఏబీవీ విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు వైసీపీ మినహా ఇతర పార్టీలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇక తాజా పరిణామంతో ఇప్పుడు ఆయనతో వైసీపీ కూడా టచ్ లోకి వెళుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.