దళపతి విజయ్ 'మేనమామ' కానుక : సెప్టెంబరు నుంచి బంగారు ఉంగరాలు!

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ మరో సంచలన పథకానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

Update: 2026-07-10 11:09 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ మరో సంచలన పథకానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన 'తాయిమామన్ తంగా మోతిరామ్ తిట్టమ్' (పసిబిడ్డలకు మేనమామ బంగారు ఉంగరం) పథకాన్ని వచ్చే సెప్టెంబరు నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ సంస్కృతి, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి పసిబిడ్డకు నేరుగా తానే 'మేనమామ'గా మారి, బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించే అద్భుతమైన పథకంగా 'తాయిమామన్ తంగా మోతిరామ్ తిట్టమ్'ను చెబుతున్నారు. తమిళ సాంప్రదాయంలో బిడ్డ పుట్టినప్పుడు మేనమామ వచ్చి కొత్త బట్టలు, ఆభరణాలు ఇచ్చి ఆశీర్వదించడం ఒక మధురమైన ఆచారం. ఈ ఆత్మీయతను ప్రభుత్వ పథకానికి జోడించిన సీఎం విజయ్, "తాయిమామన్" (మేనమామ) అనే పేరుతో ఈ పథకాన్ని రూపొందించడం విశేషం. దీని ద్వారా ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, ప్రజలతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తోంది.

దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా 'తాయిమామన్ తంగా మోతిరామ్ తిట్టమ్' పథకాన్ని తమిళనాడులో అమలు చేయనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ 22 తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దాదాపు రూ. 755.83 కోట్ల బడ్జెట్‌తో అమలు కానున్న ఈ పథకం కోసం, ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ యూనిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇది ఎటువంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పంపిణీ జరిగేలా పర్యవేక్షిస్తుంది.

ఎవరు లబ్ధిదారులు?

తమిళనాడులో ఏటా సుమారు 7.8 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. అందులో సగానికి పైగా అంటే దాదాపు 4.2 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జన్మిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవ ఖర్చులు సుమారు రూ. 63,473 వరకు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 1,364 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతోందని చెబుతున్నారు. అదేసమయంలో సర్కారు దవాఖాల్లో మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని అనవసర ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనతో సీఎం విజయ్ మేనమామ బంగారు ఉంగరాలు కానుకను తీసుకువచ్చారని అంటున్నారు. దీనికోసం ఒక్కోబిడ్డకు రూ.13,600 చెల్లించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

మహిళా సంక్షేమమే లక్ష్యం

ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు, తల్లీబిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సీఎం విజయ్ ఈ పథకంతో సామాన్యుల జీవితాల్లో సంతోషాన్ని నింపేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ప్రతి బిడ్డకు మేనమామగా నేనున్నాను అని చాటిచెప్పేలా ఉన్న ఈ నిర్ణయం, తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News