గంభీర్ పనితీరుపై సీరియస్.. బీసీసీఐ 'ప్రోగ్రెస్ రిపోర్ట్'.. శ్రేయస్ కెప్టెన్సీపై 'రివ్యూ' కొరడా
ఐపీఎల్‌లో మెంటార్‌గా ట్రోఫీలు గెలిపించి.. సీరియస్ లుక్కుతో టీమిండియా హెడ్ కోచ్ సీట్లో కూర్చున్న గౌతమ్ గంభీర్‌కు ఇప్పుడు అసలైన 'సమీక్ష' సెగ తగులుతోంది.
ఐపీఎల్‌లో మెంటార్‌గా ట్రోఫీలు గెలిపించి.. సీరియస్ లుక్కుతో టీమిండియా హెడ్ కోచ్ సీట్లో కూర్చున్న గౌతమ్ గంభీర్‌కు ఇప్పుడు అసలైన 'సమీక్ష' సెగ తగులుతోంది. మొన్న ఐర్లాండ్, నిన్న ఇంగ్లాండ్.. ఇలా వరుసగా టీ20 సిరీస్‌లలో చాపచుట్టేసిన మన ఘనపాఠీల ప్రదర్శన చూశాక బీసీసీఐ పెద్దలకు కంటిమీద కునుకు కరువైందట. "ఇదేందయ్యా గంభీరూ.. ఇదా నువ్వు చెప్పిన 'వ్యూహం'?" అంటూ బోర్డు పెద్దలు గట్టిగానే క్లాస్ పీకేందుకు రెడీ అవుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్.
'ట్రాన్సిషన్' సాకు ఇక చెల్లదు బాస్!
మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారీ "టీమ్ ట్రాన్సిషన్ మార్పుల దశలో ఉంది.. కుదురుకోవడానికి టైం పడుతుంది" అనే రొటీన్ డైలాగ్‌ను వినడానికి బీసీసీఐ ఈసారి సిద్ధంగా లేదు. "మార్పుల దశ అంటే మ్యాచ్‌లు ఓడిపోవడం కాదు నాయనా.. కొత్త వాళ్లతో గెలవడం!" అని బోర్డు భావిస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్ ముగియడమే ఆలస్యం.. కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అలాగే ఆటగాళ్ల ప్రోగ్రెస్ రిపోర్టులను టేబుల్‌పై పెట్టి విడివిడిగా విశ్లేషించబోతున్నారట.
ట్విస్ట్ ఏంటంటే .. మొన్నటిదాకా వరల్డ్ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెట్టి శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ కిరీటం తొడిగారు. అయ్యర్ గారు బ్యాటింగ్‌లో బాగానే పరుగుల తుఫాన్ కురిపిస్తున్నా.. కెప్టెన్సీలో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌన్సీ పిచ్‌లపై మన బ్యాటర్లు ‘పులిహోర’ కలిపేస్తుంటే కెప్టెన్, కోచ్‌లు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఏం ప్లాన్లు వేస్తున్నారో దేవుడికే తెలియాలి!
తిలక్ వర్మ ఫామ్.. సున్నీ భాయ్ సెటైర్లు
ఇక వరుస ఛాన్సులు ఇస్తున్నా.. 'నేను మారను' అన్నట్లుగా ఆడుతున్న యువ బ్యాటర్ తిలక్ వర్మ పేలవ ఫామ్ సెలక్టర్ల బీపీ పెంచుతోంది. అటు బౌలింగ్‌లో అయితే ఎప్పుడు ఎవరు వికెట్లు తీస్తారో ఎప్పుడు ధారాళంగా పరుగులు ఇస్తారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళం చూసి తట్టుకోలేక క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తనదైన శైలిలో ‘లెఫ్ట్ అండ్ రైట్’ ఇచ్చేశారు. "అసలు గంభీర్ వ్యూహాలు ఏంటో ఆ బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతున్నాయా?" అని ప్రశ్నించారు. ఏమాత్రం ప్రభావం చూపని వాషింగ్టన్ సుందర్‌ను నాలుగో టీ20లోనూ ఎందుకు కొనసాగించారో.. ఒక పేస్ ఆల్‌రౌండర్‌ను ఎందుకు పక్కన పెట్టారో కోచ్‌కే తెలియాలని సెటైర్లు వేశారు.
వచ్చే ఏడాది వరల్డ్ కప్.. గంభీర్ సీటు సేఫేనా?
నిజానికి గంభీర్ పదవీకాలం వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు ఉంది. కానీ ఈ లోపే సీన్ రివర్స్ అయింది. కొత్త కోచ్ వస్తాడనే రూమర్లను బోర్డు అధికారికంగా ఖండించనప్పటికీ.. గంభీర్ మార్క్ ‘అగ్రెసివ్ క్రికెట్’ ఇలాగే ఓటములతో సాగితే మాత్రం బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకునేలా ఉంది.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఆ తర్వాత జింబాబ్వే పర్యటన లైన్లో ఉన్నాయి. ఈ లోపే బీసీసీఐ 'సమీక్ష' అనే కొరడా ఝుళిపిస్తే.. ఎంతమంది సీనియర్లు బెంచ్‌కే పరిమితమవుతారో, ఎంతమంది యువ ఆటగాళ్లకు చెక్ పడుతుందో చూడాలి. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం "వ్యూహాలు మార్చండి గంభీర్ గారూ.. లేదంటే బోర్డు మిమ్మల్ని మార్చేలా ఉంది!" అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.