పవన్ వర్సెస్ కోమటిరెడ్డి.. చంద్రబాబు వద్దకు పంచాయితీ!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది.;

Update: 2025-12-04 09:00 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది. ఏపీ డీసీఎంపై కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. దీంతో ఏపీ డిసీఎంపై కోమటిరెడ్డి చేస్తున్న విమర్శలపై వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందా? అనే సందేహం తలెత్తుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మంత్రి కోమటిరెడ్డితోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలను కూడా కాంగ్రెస్ నాయకులు వెనక్కి నెట్టేశారు. పవన్ తో తాడోపేడో తేల్చుకుంటామంటున్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

గత నెల 26న అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, పచ్చగా ఉన్న కోనసీమ వెలవెలవోవడంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. కోనసీమ అందాలపై తెలంగాణ నేతలు గొప్పగా చెప్పేవారని, బహుశా వారి దిష్టి తగిలిందేమో కోనసీమలో కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి మోడులా మారిపోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యల్లో తెలంగాణ నేతలపై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అవి వివాదంగా మారాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ముందు బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు పవన్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ఒక అడుగు ముందుకేసి పవన్ సినిమాలను తమ రాష్ట్రంలో ఆడనివ్వమంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆయనను టార్గెట్ చేస్తూ పవన్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు శ్రుతిమించి అణుచిత వ్యాఖ్యలతో పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు, కోమటిరెడ్డి అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు.

ఇలా ఇరుపక్షాల మధ్య వివాదం మంచి వేడి మీద ఉండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ పర్యటనకు రావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు కోమటిరెడ్డి గురువారం ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. ఆయన సీఎంతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ అత్యంత నమ్మకస్తుడు. మంచి మిత్రుడు. దీంతో ఆయనపై విమర్శలను చంద్రబాబు కూడా తప్పుబడుతున్నారని అంటున్నారు. సీఎంతో కోమటిరెడ్డి భేటీ తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News