కాంగ్రెస్ - బీజేపీ మధ్యలో శశిథరూర్... రాహుల్ పై అసూయ కామెంట్స్!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ అన్ని రకాల చర్యలకు ఉపక్రమిస్తోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-05-17 08:04 GMT

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ అన్ని రకాల చర్యలకు ఉపక్రమిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన చర్యల్లో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ అనే సైనిక చర్యకు దిగింది. పాక్ లోని ఉగ్రవాదులకు తన రియాక్షన్ ని హై సౌండ్ తో చెప్పింది.. పాకిస్థాన్ లో రీసౌండ్ రప్పించింది.

అయితే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ నెల 10 సాయంత్రం 5 గంటల తర్వాత కాస్త సద్దుమణిగాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. మరోపక్క పాక్ పై తీసుకుంటున్న దౌత్య పరమైన చర్యల్లో భాగంగా.. భారత ప్రతినిధుల బృందాలను విదేశాలకు పంపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా.. ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాక్ వైఖరిని ప్రపంచానికి చెప్పాలని.. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించాలని భావించిన కేంద్రం.. దీనికోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆ బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లు ప్రకటించింది. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.

అవును... పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచానికి వివరించడం కోసమని భారత ప్రభుత్వం ఏడు బృందాలను పంపబోతోంది. ఈ అఖిలపక్ష బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను ప్రకటించింది. అయితే.. ఇందులో కాంగ్రెస్ పార్టీ తమవైపు నుంచి ప్రతిపాదించిన పేర్లు కాకుండా.. శశిథరూర్ పేరు ప్రకటించింది కేంద్రం. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి పాక్ ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఈ నెల 16న కోరగా.. కాంగ్రెస్ పార్టీ తరుపున రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో మాజీ కేంద్రమంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్ సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగోయ్ ఉన్నారు!

అయితే... ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో ఆ నలుగురి పేర్లు లేవు. కానీ.. ఎంపీ శశిథరూర్ పేరు ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన పేరును బీజేపీ కన్ఫాం చేసింది. డీనిపై శశిథరూర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తాజా పరిణామల నేపథ్యంలో దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భంగా అక్కడ నా అవసరం ఉంటే నేను అందుబాటులో ఉంటాను.. జైహింద్ అని రాసుకొచ్చారు.

ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం పేరు ప్రతిపాదించకపోయినా.. నేరుగా కేంద్రం తన పేరు ప్రతిపాదించడంపై... “తాను సిద్ధం, జైహింద్” అని థరూర్ స్పందించడంతో... వాట్ నెక్స్ట్? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీనిపై స్పందించిన బీజేపీ... శశిథరూర్ వాగ్ధాటిని, ఐక్యరాజ్యసమితి అధికారిగా ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని, విదేశాంగ విధాన విషయాలపై ఆయనకున్న లోతైన అంతర్ దృష్టిని ఎవరూ కాదనలేరని.. అయితే, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ.. కీలక అంశాలపై భారత్ వైఖరిని వివరించడానికి విదేశాలకు పంపబడుతున్న అఖిల పక్ష పార్టీల ప్రతినిధుల బృందాలకు ఆయనను నామినేట్ చేయకూడదని ఎందుకు ఎంచుకున్నారు.. ఇది అభద్రతా భావమా.. లేక, అసూయా అని ప్రశ్నించింది!

ఇక.. శశిథరూర్ (కాంగ్రెస్) తో పాటు విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించే మిగిలిన పార్టీల ఎంపీల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ)

బైజయంత్ పాండా (బీజేపీ)

కనిమొళి (డీఎంకే)

సంజయ్ కుమార్ ఝూ (జేడీయూ)

సుప్రియా సూలె (ఎన్సీపీ - ఎస్పీ)

శ్రీకాంత్ శిండే (శివసేన)

వీరి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల పాటు ఐదు దేశాలకు వెళ్తాయి. ఇందులో భాగంగా.. మే 22న విదేశాలకు బయలుదేరిన ఈ బృందాలు జూన్ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలో వీరు.. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఏ విధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని చెప్పనున్నారు.

ఇదే సమయంలో.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ఎలా చేపట్టిందీ వివరించడంతోపాటు.. ఆపరేషన్ సమయంలో ఉగ్రస్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని.. పౌరులకు ఎలాంటి హానీ కలిగించలేదనే విషయాన్ని స్పష్టం చేయనుంది.

Tags:    

Similar News