వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు...స్పీకర్ అయ్యన్న సంచలనం
ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు, ఇప్పటికి 21 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది.;
ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు, ఇప్పటికి 21 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది. అనేక సార్లు శాసనసభ సమావేశాలను నిర్వహించింది. అయితే రెండు సందర్భాలలో తప్ప వైసీపీ సభ్యులు సభకు ఎక్కడా హాజరు కాలేదు, 2025 లో బడ్జెట్ సెషన్ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసిన సందర్భంగా జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. ఇక ఈ ఏడాది కూడా బడ్జెట్ సెషన్ కే హాజరయ్యారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు వచ్చాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేల గైర్ హాజర్ మీద స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు.
నోటీసులు ఖాయం :
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం మీద నోటీసులు జారీ చేస్తామని స్పీకర్ తెలిపారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి హాజరు అయ్యారు అని అయితే దానికి పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలకు హాజరైతేనే హాజరుగా గుర్తిస్తామని అంటున్నారు. ఇక సభకు వరసగా 65 రోజులు హాజరు కాకపోతే వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తామని స్పీకర్ అంటున్నారు.
చర్యలు తీసుకునేలా :
ఇదిలా ంటే సభ్యులు సభకు హాజరు కాకుండా ఉంటే వారి మీద చర్యలు తీసుకునేలా చట్టాలు పార్లమెంట్ చేయాలని అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ విషయం మీద తాను లోక్ సభ స్పీకర్ ని సంప్రదిస్తాను అని చెప్పారు. అసెంబ్లీకి ఎవరైనా గైర్ హాజరు అయితే తప్పనిసరిగా చర్యలు ఉండాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు.
జగన్ కి ప్రతిపక్ష హోదా :
ఇక అసెంబ్లీలో కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు ఉన్న వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇచ్చేది జరగదు అని స్పీకర్ స్పష్టం చేశారు నిబంధనల మేరకే సభ నడచుకుంటుందని ఆయన అంటున్నారు. దాంతో జగన్ ఆయన ఎమ్మెల్యేలు సభకు రావాలంటే ఈ విషయం మీద ఆలోచించడం మానేసి తాముగానే హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు.
జీతాలు తీసుకుంటున్నారు :
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారు అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సభకు గైర్ హాజరవుతూ జీతాలు తీసుకోవడం మీద కూడా స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మొత్తం విషయాల మీద పార్లమెంట్ లో చట్టం చేసేలా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలుస్తామని ఆయన చెబుతున్నారు.
65 రోజులు పూర్తి అయినట్లేనా :
ఇదిలా ఉంటే 2024 జూన్ 12న ఏపీ కొత్త అసెంబ్లీ ఏర్పడింది. ఇక అదే నెలలో తొలి సమావేశాలు నిర్వహించారు. అలా చూసుకుంటే ఇప్పటిదాకా అనేక సార్లు సభ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సెషన్ పూర్తి స్థాయిలో రెండు సార్లు జరిగింది. వర్షాకాల శీతాకాల సమావేశాలు కూడా జరిగాయి. ఇవన్నీ లెకక్ తీసుకుంటే కనుక 65 రోజులు ఇప్పటికే పూర్తి అయినట్లేనా అన్న చర్చ ఉంది. అయితే ఇంకా మరో రెండు సెషన్ల దాకా సమయం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి 65 రోజుల గడువు పూర్తి అయితే స్పీకర్ నోటీసులు ఇస్తారు, మరి ఆ నోటీసులు ఎలా ఉంటాయో దానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఏ రకమైన జవాబు చెబుతారో చూడాలి. ఏది ఏమైనా శాసనసభలో స్పీకర్ దే పూర్తి అధికారం ఉంటుంది. ఆయన నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించేది ఉండదని అంటున్నారు. మరి వైసీపీ దీని మీద ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.